ఏలూరులో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించండి

10 Dec, 2020 05:29 IST|Sakshi

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల్లో తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీ (ఆరోగ్య అత్యవసర పరిస్థితి) ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఏలూరులో బాధితుల సంఖ్య పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం, వింత వ్యాధిగా ప్రచారం సాగుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారని పేర్కొన్నారు. సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై రానున్న కాలంలో చూపే దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి రోగికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలన్నారు. ఎక్కడికక్కడ క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను నియమించి సత్వర ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు. మొబైల్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని, ప్రతి బాధితునికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా.. రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం కట్టలేదని, తుఫాను వస్తే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కుకూడా లేదని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడంకాదని, వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. 

పన్నుల సీఎంగా మారారు
పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్లతోపాటు, రోడ్లపైనా పన్ను వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పన్నుల సీఎంగా మారారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం కడప పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నేతలతో ఆన్‌లైన్‌లో ఆయన మాట్లాడారు. సీఎం, ఆయన అనుచరుల అవినీతి కోసమే పాలసీలు రూపొందిస్తున్నారన్నారు. కడపలో ఎస్సీ మహిళను దారుణంగా మానభంగం చేసి చంపేస్తే కనీస విచారణ చేయలేదని, సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో తెలుస్తోందన్నారు. స్థానిక, జమిలి ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు