అమిత్‌షాతో చంద్రబాబు భేటీ 

4 Jun, 2023 05:20 IST|Sakshi
ఢిల్లీలో చంద్రబాబు

భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు 

సుమారు 45 నిమిషాలపాటు సమావేశం 

ఏపీలో పొత్తుల విషయం ప్రస్తావించిన బాబు 

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 9 గంటలకు హోంమంత్రి అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. ముందుగా 8 గంటలకే సమావేశం అనుకున్నప్పటికీ అమిత్‌ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

తర్వాత కొద్ది సేపటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు, ఇతరత్రా అంశాలపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా డిసెంబరులో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బీజేపీకి అందించే సహకారంపై చర్చ సాగినట్లు సమాచారం.

తెలంగాణ ఎన్నికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపింది. టీడీపీ ఓటు బ్యాంకు బదిలీ, క్యాడర్‌ సహకారం, ఎల్లో మీడియా మద్దతు ఇస్తామని.. దీనివల్ల బీజేపీకి లాభిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీలో సైతం పొత్తులు కొనసాగించాలని బాబు కోరినట్లు సమాచారం.

ఈ విషయమై అమిత్‌షా, నడ్డా ఏం చెప్పారన్నది బయటకు వెల్లడికాలేదు. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయాక, ఏపీలో పొత్తుల అంశంపై ఏం చేయాలనే దానిపై అమిత్‌ షా, నడ్డా చర్చించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే ఎంపీ గల్లా జయదేవ్‌ అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. 

సంజాయిషీ ఇచ్చుకొని.. సహకారం కోరిన బాబు 
2018 తర్వాత అమిత్‌షాతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే తొలిసారి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో గత (తన) ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తుపై జోక్యం చేసుకొని తనకు సహకరించాలని కూడా అమిత్‌షాను చంద్రబాబు కోరినట్లు తెలిసింది.

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమనాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు వచ్చారు.   

మరిన్ని వార్తలు