మాట తప్పడమే బాబు నైజం!

17 Nov, 2020 11:12 IST|Sakshi

సంప్రదాయానికి నీళ్లొదిలిన బాబు 

తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ 

నాటి విలువలకు నేడు తిలోదకాలు 

సాక్షి, తిరుపతి: చంద్రబాబు అసలు నైజం బట్టబయలైంది. మాటకు కట్టుబడే అలవాటు తనకు లేదనే విషయం మరోసారి రుజువైంది. ప్రజాప్రతినిధి ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఏకగ్రీవంగా అవకాశం కల్పించడమనే సంప్రదాయం రాష్ట్రంలో ఉంది. దీనికి కట్టుబడి అప్పట్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ మృతితో వచ్చిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ సమయంలో ఎంత ఒత్తిడి వచ్చినా సంప్రదాయాన్నే గౌరవించింది. అలాగే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఆయన కుటుంబంలోనే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అంతా అనుకున్నారు. నాటి విలువలకు నేడు టీడీపీ, బీజేపీ తిలోదకాలిచ్చాయి. (పోలవరంపై తప్పుడు ప్రచారం)

ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తిరుపతి ఉపపోరులో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం చంద్రబాబు సైతం టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించారు. అయితే పనబాక కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగింది. ఆమె కూడా టీడీపీ నుంచి జారిపోకుండా చూసుకునేందుకు అభ్యర్థిగా ఖరారు చేశారని సమాచారం. బీజేపీ అభ్యర్థి ఎంపిక సైతం కొలిక్కివచ్చినట్లు తెలిసింది. ఓ విశ్రాంత ఐఏఎస్‌ అధికారిని బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈక్రమంలో టీడీపీ, బీజేపీ దొందూ.. దొందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమే అనుకుంటున్నారు. చదవండి: ‘అచ్చోసిన’ ఆరు అబద్ధాలు

మరిన్ని వార్తలు