అధికారమైనా.. ప్రతిపక్షమైనా దూరమే

29 Sep, 2020 08:10 IST|Sakshi

 జిల్లాలో ముగ్గురిని అధ్యక్షులుగా ప్రకటించిన టీడీపీ

ఏ ఒక్క చోటా ఎస్సీలను నియమించని వైనం

రిజర్వు స్థానాలు ఉన్నా ఇవ్వని చంద్రబాబు

స్వార్థ రాజకీయాలకు ఎస్సీలు కావాలా? అంటూ ఆగ్రహం

ఇటీవల చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎస్సీలను విస్మరించారని ఆరోపిస్తున్నారు. వారిపై పనిగట్టుకుని దాడులు చేస్తున్నారని నోరుపారేసుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం వారిని అణగదొక్కడానికే ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా ఆ సామాజిక వర్గాన్ని దూరంగా నెట్టేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇది తేటతెల్లమయ్యింది. రిజర్వు స్థానాలు ఉన్నా ఏ ఒక్క చోటా అధ్యక్షులుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించలేదు. దీనిపై ఆ సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారు. ఆయన కుటిల నీతికి, స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడుతున్నారు.  

సాక్షి, తిరుపతి : జిల్లాలో సుమారు 45 లక్షల జనాభా ఉంటే.. 25 లక్షలకుపైగా ఎస్సీలు ఉన్నారు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో రెండింటిని, 14 అసెంబ్లీ స్థానాల్లో మూడు నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వు చేశారు. చంద్రబాబు ఆదివారం మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. కానీ ఏ ఒక్క స్థానానికి ఎస్సీలకు కేటాయించలేదు. జిల్లా అధ్యక్ష పదవులపై ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఎస్సీ సామాజికవర్గం పట్ల ఆయన వివక్ష చూపారంటూ పలువురు లోలోపలే కుమిలిపోతున్నారు. దివంగత మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ కుటుంబం టీడీపీనే శ్వాసగా.. చంద్రబాబే ధ్యాసగా పెట్టుకుంది. (కులాల మధ్య చంద్రబాబు చిచ్చు)

ఆ కుటుంబంలోని వారికి ఈ సారి అధ్యక్ష పదవి లభిస్తుందని ఆశించారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేడీ రాజశేఖర్‌ టీడీపీ జెండా మోస్తున్న వ్యక్తి. వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి, టీడీపీ కండువా కప్పుకున్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్, సీనియర్‌ నాయకులు పరసారత్నం, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారితో పాటు పలువురు ఎస్సీ సామాజికవర్గ నాయకులు ఉన్నారు. వీరిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించారు. అయితే చంద్రబాబు ఆ సామాజికవర్గం వారిని పూర్తిగా పక్కనపెట్టారు. బీసీలు టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండడంతో తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్ష పదవిని నరసింహయాదవ్‌కు కట్టబెట్టారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
 
చర్చించకుండానే..  
పార్లమెంట్‌ జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపుపై టీడీపీ శ్రేణులతో చర్చించిన దాఖలాలు లేవని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన నాయకులను కూడా సంప్రదించలేదని తెలిసింది. 2019 ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాలకు ఇదే తరహాలో అభ్యర్థులను ప్రకటించడంపై పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు చెబుతున్నారు.తంలో పార్టీ పదవులు ప్రకటించే ముందు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసేవారని, ఆ సమావేశాల్లో పలువురు నాయకులతో చర్చించేవారని గుర్తుచేస్తున్నారు. చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్ష పదవిని పులివర్తి నానికి ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. మదనపల్లె, తిరుపతి అధ్యక్ష పదవులపై ఆశలు పెట్టుకున్న వారు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. తమకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా.. మాట మాత్రానికైనా చెప్పి పదవులు ఇచ్చి ఉంటే బాగుండేందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాలే అజెండాగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు