Chandrababu Controversial Comments: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదు

5 Dec, 2021 11:24 IST|Sakshi

సీఎం జగన్‌ని ఆప్యాయంగా పలకరిస్తారా?

ఏం మనుషులు వీళ్లు, సభ్యత లేకుండా ఉన్నారు

ప్రజలపై విరుచుకుపడిన చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తే ఆప్యాయంగా పలకరిస్తారా అని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి బాధితుల పరామర్శకు వెళ్లినపుడు ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా. 62మంది చనిపోతే బాధ ఉండదా?, సీఎంను పొగుడుతారా?, గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా?, ఏం మనుషులు వీళ్లు. సభ్యత, సంస్కారం లేకుండా ఉన్నారు.

బుద్ధి, జ్ఞానం లేకపోతేనే ఇటువంటి ఆలోచనలు వస్తాయి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘మిమ్మల్ని దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, మా ఏసుక్రీస్తు వచ్చాడని ప్రజలు పొగుడుతారా’ అని సీఎంను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల వల్ల వరదలొచ్చి 62 మంది చనిపోయారని, రూ.6 వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పార్లమెంటు సాక్షిగా అన్న మాటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలిసో, తెలియకో ప్రజలు ఓట్లేస్తే వారి ప్రాణాలు బలగొంటున్నారని విమర్శించారు. 

పెనుకొండ ఫలితాలపై బాబు ఆగ్రహం: పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవటం ఏమిటని అనంతపురం జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుకొండ ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. 

మరిన్ని వార్తలు