Chandrababu: సాయంత్రం కాగానే మందుబాబులకు బాబే గుర్తొస్తారట! అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారుగా!

2 Jan, 2023 19:29 IST|Sakshi

ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆయన చెబుతున్న ఈ సుభాషితాలు విన్నవారు ముక్కున వేలేసుకోవల్సిందే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిలో అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే .. తమ్ముళ్లూ ..సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు నేనే గుర్తుకు వస్తాను.. అని ఆయన గర్వంగా చెప్పుకోవడం. తాగినప్పుడు బూతులు తిడతారు.. తర్వాత మర్చిపోతారు.. అన్నారు. 

అంటే మద్యం బాబులు బ్రాందీ, విస్కి వంటివి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుని, ఆ తర్వాత వారు మర్చిపోతున్నారట. ఇది ఆయన బాధ. జగన్ మద్యం రేట్లు పెంచేశారని, మంచి బ్రాండ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎవరైనా పెద్ద నాయకుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాలి. అది మంచిదికాదని వారించాలి. కాని చంద్రబాబు ఏమంటున్నారు! సాయంత్రం అయితే పెగ్గు వేసుకోవాలని గతంలో అన్నారు. 

ఇప్పుడేమో సాయంత్రం అయితే తానే గుర్తుకు వస్తానని చెబుతున్నారు. అవును నిజమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపారు. ఇళ్లకు కూడా మద్యం సరఫరా చేశారు. మహిళలంతా తమ భర్తలను తాగుబోతులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని మండిపడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాని ఆయన మాత్రం మారలేదు. మద్యం ఏదో అత్యవసర వస్తువుగా ఆయన భావిస్తున్నారు. దానిని చౌకగా అందుబాటులోకి తేవాలట. జగన్ ఏవేవో బ్రాండ్లు తెచ్చారట. వాటికి నాణ్యత లేదట. 

ఇంతవరకు ఆ బ్రాండ్ల వల్ల ఏమైనా హానీ కలిగిందా? అంటే లేదు. పోనీ ఆ బ్రాండ్లు ఏమైనా జగన్ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ బ్రాండ్ లన్నీ ఇచ్చారని స్వయంగా జగన్ అసెంబ్లీలో పేర్లు చదివి మరీ వినిపించారు. అయినా చంద్రబాబు మాత్రం అదే అసత్యాన్ని వల్లె వేస్తుంటారు. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు ఎంత ప్రయోజనం చేకూరుతుందంటే అనుమానమే. మరో మాట చెబుతున్నారు. రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా జగన్ నే దూషిస్తున్నారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదికార వైసిపిపై పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలి. అంతా డబుల్ స్టాండర్డే. చంద్రబాబు నిజంగానే అంత బాగా చేసి ఉంటే జనం ఎందుకు అంత దారుణంగా ఓడిస్తారు? అదేదో జనం చేసిన తప్పు మాదిరిగా ఆయన ఊహించుకుంటూ , శుద్దిమంతుడి మాదిరి గా ఉపన్యాసాలు చెబుతుంటారు. మీడియా వారిని బాగున్నారా? అని అడిగితే బాగున్నాం అంటే ఆయనకు నచ్చలేదట. 

దానిని గమనించిన ఒకరిద్దరు బాగోలేదని అనగానే మళ్లీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు అందుకున్నారట. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారని, ఇంకా ఏవేవో అన్నారు. ఏ జర్నలిస్టుపై ప్రశ్నిస్తే కేసు పెట్టారు. తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన ఒక రిటైర్డ్ జర్నలిస్టుపై చర్య  తీసుకుంటే కోర్టు ద్వారా రక్షణ పొందారు కదా! ఇప్పుడు ఎవరు జగన్ ను విమర్శించినా, అధికారికంగా ఎవరిపైనా చర్య తీసుకోలేకపోతున్నారు. అదే ప్రధాని మోదీనో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నో అని చూడమనండి .. తమాషా ఏమిటో తెలుస్తుంది. 

న్యాయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారట. నిజానికి న్యాయ వ్యవస్థ అయినా మరో వ్యవస్థ అయినా అన్నిటి సమస్యలు ఎదుర్కొంటున్నది జగన్ ప్రభుత్వం. అయితే ఈయన ఎదురుదాడి చేస్తుంటారు. అసలు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని కదా చంద్రబాబుకు పేరు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన కోర్టు, చంద్రబాబు ఆస్తుల విషయంలో ఎన్ని మలుపులు తిప్పింది అందరూ గమనించారు కదా? 

చాలామందికి నాట్ బిఫోర్ అన్న పదం న్యాయ వ్యవస్థలో ఉంటుందన్న సంగతి  తెలియదు. కాని చంద్రబాబు కేసులో మాత్రం అది బాగా పాపులర్ అయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ ను ఆడిపోసుకోవడమే కాని, తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేక నోటికి వచ్చిన దూషణలతో  కాలం గడుపుతున్నారు. అదే రాజకీయం అని, తనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఆ దూషణలతో  ప్రజలను ప్రభావితం చేయాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. మరి అది సాద్యమేనా?
-హితైషి

మరిన్ని వార్తలు