మళ్లీ మొదలైన చంద్రబాబు మార్కు రాజకీయం

12 Aug, 2020 14:38 IST|Sakshi

సాక్షి, అమరావతి‌ : కరోనా వైరస్‌ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌కే పరిమితమై జూమ్ యాప్‌లో ఊదరగొడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయ నేతగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా మరోసారి సీమకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడటమే ఆయన లక్ష్యం. అప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే బాబు నైజం. (ఆరోపణలపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ )

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎదురు దాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆపాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వెన్నుపోటు ఖాయం అనే ధోరణి బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ('ఏ ఒక్కరి మీద ఆంక్షలు లేవు.. పూర్తిగా మీ స్వేచ్ఛ' )

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. (చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన వైద్యారోగ్యశాఖ)

తాజాగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగునీటితో పాటు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా పబ్బం గడవదని భావించారు. రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకుఅడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. (రాజకీయాల కోసం వాడుకుంటున్నారు!)

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, నాగం మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు వారికి ఏపీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. 

ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అభినందిచక పోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా చంద్రబాబు ఉండాల్సిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా