అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌..

30 Oct, 2021 09:33 IST|Sakshi
ఒంగి మరీ నమస్కారం పెడుతున్న చంద్రబాబు

కుప్పంలో అవే ‘రుణం’ మాటలు 

ఈసారి కొత్తగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు 

ఎంత యాగీ చేసినా రక్తి కట్టని షో 

అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌.. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిరోజు శుక్రవారం పర్యటనకు సంబంధించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇంతే.. అవే ‘‘రుణం’’ మాటలతో ఆగకుండా గంటన్నర మాట్లాడేశారు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ సారి క్యాడర్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 

సాక్షి, తిరుపతి: రెండు రోజుల  కుప్పం పర్యటనలో తొలిరోజు కుప్పం బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద జరిగిన బహిరంగసభలో స్థానిక ప్రజలనుద్దేశించి చంద్రబాబు ఎప్పటిలాగే మీ రుణం తీర్చుకోలేనంటూ సెంటిమెంట్‌ డైలాగులు వల్లించేశారు. 2004, 2009, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడికి విచ్చేసి.. పార్టీ అధికారంలోకి రాకపోయినా మీరు నన్ను గెలిపించారు.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి వచ్చిన బాబు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు పెట్టారు. మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. మన అనుబంధం ఎవ్వరూ విడదీయలేరు.. అంటూ నాలుగుదిక్కులూ చూస్తూ బాగా ముందుకు వంగి ఓ విధంగా పొర్లు దండాలు పెట్టినంత పనిచేశారు. బాబు తన రెండు చేతులతో నమస్కారం పెడతారని ఊహించిన స్టేజీపైన నాయకులు ఒక్కసారిగా ఈయన పూర్తిగా ఒంగిపోవడంతో ఒకింత కంగారు పడ్డారు. 

                ఏఆర్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలు

ఎంతయినా అద్దె జనం.. అవుతుందా ప్రభంజనం 
మునుపెన్నడూ లేనివిధంగా కుప్పంకు ఈసారి భారీ సంఖ్యలో బయటి ప్రాంతాల నుంచి కార్యకర్తలను, ఓ రకంగా చెప్పాలంటే అద్దె జనాన్ని చంద్రబాబు సభకు తరలించారు. అందుకే బాబు ప్రసంగిస్తుంటే.. ఎక్కడా వారి నుంచి స్పందన రాలేదు. చివరికి చంద్రబాబు నేరుగా వారినుద్దేశించి.. నేను ప్రభుత్వంపై పోరాడుతున్నాను.. మీరు నాతో కలిసి వస్తారా.. ధర్మపోరాటానికి సహకరిస్తారా..? అని ఒకటికి పలు పర్యాయాలు అడిగినప్పటికీ జనం నుంచి స్పందన లేకపోయింది. 

చదవండి: (చంద్రబాబుకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించండి)

క్యాడర్‌ అరాచకం చేస్తున్నా వారించని బాబు 
సహజసిద్ధంగానే ప్రభుత్వంపై అకారణంగా విషం చిమ్ముతూ తీవ్ర విమర్శలు చేసే బాబు ఈసారి దానికి అదనంగా కుప్పంలో టీడీపీ శ్రేణులను అరాచకం సృష్టించే దిశగా ప్రోత్సహించారు. పచ్చమూకలు ఉదయం నుంచి కుప్పం పట్టణంలో మద్యం మత్తులో ఊగిపోతూ బండబూతులు మాట్లాడుకుంటూ తిరుగుతూ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలన్నీ చించివేశారు. ఫ్లెక్సీలను, వైఎస్సార్‌సీపీ బోర్డులను తొలగిస్తున్న పచ్చమూకలను అడ్డుకునేందుకు యత్నించిన ఏఆర్‌  పోలీసులపైనా దాడి చేసినంత పనిచేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కలిగింది. ఇక బాబుకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన టూరిజం శాఖ ఉద్యోగిని చావగొట్టేశారు. ఈ ఘటన చూస్తూ కూడా చంద్రబాబు కనీసం వారించకుండా బాంబులు తెచ్చాడేమో చూడండి.. అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం! 

           జన సమీకరణకు సంబంధించి డబ్బుల పంపిణీ 

కరెంటు తీసేశారంటూ హడావుడి 
బాబు బస చేసిన ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందంటూ టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. కరెంటు పోవడంతో చివరికి జనరేటర్‌ పెట్టారని ఆరోపిస్తూ నానాయాగీ చేశాయి. ఈ విషయాన్ని గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ(రెస్కో) ఎండీ సుబ్రహ్మణం తీవ్రంగా ఖండించారు. ఒక్క సెకను కూడా కరెంటు పోలేదనీ.. ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్‌ ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు కరెంటు పోయిందేమోనని అపోహ పడ్డారని ఆయన చెప్పారు. మొత్తంగా నానాయాగీ చేసి కుప్పంలో తన ఉనికిని చాటుకోవాలనుకున్న బాబు ’షో’ రక్తి కట్టలేదనే చెప్పాలి.  

మరిన్ని వార్తలు