Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు

8 Jan, 2023 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం చంద్రబాబు పోలీసులు, మీడియాపై దూషణలకు దిగారు. ఓ క్రమంలో మీరు పోలీసులా.. టెర్రరిస్టులా అంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకొని ప్రశ్నలు అడగాలంటూ మీడియాపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మాకూ ఓ మీడియా సపోర్ట్‌ ఉందంటూ చంద్రబాబు రెచ్చిపోయారు. ఒకరిద్దరు అటూ ఇటూ తాళాలు వేస్తున్నారని అన్నారు. ధైర్యం ఉంటే వాళ్లకు వ్యతిరేకంగా రాయండి. అప్పుడు నా దగ్గరకు రండి.. మాట్లాడతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే, చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా.. అక్కడ పెద్దగా స్పందన లేకపోవడం గ్రహించిన చంద్రబాబు.. తన ఎల్లో మీడియా ద్వారా విస్తృత ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారంటూ.. టీడీపీ శ్రేణుల ద్వారా హడావుడి చేయించారు. తన జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల పైకి ఉసిగొల్పారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చనే ఉద్దేశంతో కొందరు టీడీపీ శ్రేణులను సామాన్య జనం రూపంలో గడ్డూరు క్రాస్‌ వద్దకు పంపించారు. వారి వద్ద రాడ్లు, కర్రలు, రాళ్లు కనిపించాయి. వారి ద్వారా గొడవ సృష్టించి లబ్ధి పొందడానికి విఫల యత్నం చేశారు. 

జనం ముసుగులో పోలీసులపై దాడి
బుధవారం ఉదయం నుంచే గడ్డూరు వద్ద వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అద్దె మనుషులు ఇరుకైన రోడ్లపై గుమికూడారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ససేమిరా అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీని­వాసులు తెలుగు తమ్ముళ్లను మరింత రెచ్చగొట్టారు. పోలీసులపై దాడికి దిగేలా ఉసిగొల్పారు. దీంతో కార్యకర్తలు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బందోబస్తు బ్యారికేడ్లను పక్కకు లాగేశారు. రోడ్డుపై బైఠాయించారు. ‘సీఎం డౌన్‌డౌన్‌.. ఇదేం ఖర్మ.. ఇదేం ఖర్మ..’ అంటూ నినాదాలతో రెచ్చిపోయారు.  ఈ గందరగోళం మధ్య కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై పిడిగుద్దులతో దాడి చేశారు.

పోలీసులు కూడా లాఠీలను పైకెత్తి వారిని తరిమే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సరిహద్దు నుంచి చంద్రబాబు 121 పెద్దూరు చేరుకున్నాక టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. ఇంకో వైపు తమను అడ్డుకుంటున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా బ్రేకింగ్‌ న్యూస్‌లు వేయించారు. ఉదయం నుంచి ఇలా జరిగేలా చంద్రబాబు ప్రణాళిక రచించి, అమలు చేయించారని స్పష్టమైంది. ఇలా గొడవ చేయడం ద్వారా పోలీసులు తనను అరెస్టు చేసేలా వ్యూహం పన్నారు. అయితే పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు, శ్రేణులను సమర్థవంతంగా కట్టడి చేశారు.

మరిన్ని వార్తలు