బాబు బెదిరింపులు: వారికి రక్షణ కవచంగా ఉండండి.. హద్దుమీరితే వదులుకునేందుకు సిద్ధం

6 Oct, 2022 09:18 IST|Sakshi

ఉత్తరాంధ్ర టీడీపీ నేతల గొంతు చంద్రబాబు నొక్కేస్తున్నారా? ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని వారిమీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారా? గతంలో విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతించిన టీడీపీ నేతలు ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు?. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు తమ పార్టీ నేతలకు హెచ్చరిస్తున్నారా?. 

విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినపుడు అందరికంటే ముందు స్వాగతించింది ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులే. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక హోటల్‌లో సమావేశమైన విశాఖ టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ నేతలపై చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేస్తున్నారు. 

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుందని.. ఆ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తే వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు పచ్చ పార్టీ బాస్‌ చంద్రబాబు. 

ఇటీవల ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో జూమ్‌ సమావేశం నిర్వహించిన చంద్రబాబు అమరావతి రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రవేశిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని సూచించారు. పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీడీపీ శ్రేణులు రక్షణ కవచంగా ఉండాలన్నారు. ఈ బాధ్యతలను మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణకు అప్పగించారు. పాదయాత్రను ఉమ్మడి విశాఖ జిల్లాలో విజయవంతం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడి కుమారుడికి ఎంపీ సీటు, బండారు సత్యనారాయణ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడానికి కూడా చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

చంద్రబాబు తీరును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన రాజధాని కోసం ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా వస్తే తమ పిల్లల భవిష్యత్‌ బాగుపడటంతోపాటు, భూములకు కూడా మంచిరేట్లు వస్తాయని అభిప్రాయపడతున్నారు. 

దశాబ్దాలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. చంద్రబాబు బెదిరించి, భయపెట్టి తమ గొంతును నొక్కిపెట్టొచ్చు.. కానీ ప్రజల ఆకాంక్షను మాత్రం అడ్డుకోలేరని టీడీపీ నేతలే హెచ్చరిస్తున్నారు. గతంలో విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్‌ ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే ఆయన పేరుమీద ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి ఒక దొంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో వాసుపల్లి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. లేఖ చూసి కంగుతిన్న వాసుపల్లి పరిపాలనా రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తూ తాను ఎటువంటి లేఖ రాయలేదంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. విశాఖపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ టీడీపీకి వాసుపల్లి గుడ్‌బై చెప్పారు.

మరో సీనియర్‌ నేత రెహ్మాన్‌ కూడా పరిపాలనా రాజధానిగా విశాఖను స్వాగతిస్తూ.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీని వీడారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు రాజకీయంగా జన్మనిచ్చిన ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణలో పట్టిన గతే ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి పడుతుందని ఇప్పటికైనా చంద్రబాబు తన సామాజికవర్గ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తే పార్టీకి మంచిదని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు