నేను చెప్పేవాటిని ప్రజలు అధ్యయనం చేయాలి

11 Aug, 2020 05:19 IST|Sakshi

ఐదేళ్లలో 13 జిల్లాలను అభివృద్ధి చేశాం 

14 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి

ప్రతిపక్ష నేత చంద్రబాబు

సాక్షి, అమరావతి: తాను చెప్పే విషయాలను ప్రజలు అధ్యయనం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. కరోనా వైరస్‌ వల్ల ప్రజల ముందుకు రాలేకపోతున్నానని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..

► అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏ జిల్లాకు ఏంచేశారో చెప్పాలి. మేం ఐదేళ్లలో 13 జిల్లాలను అభివృద్ధి చేశాం. రెండంకెల వృద్ధిని సాధించాం. 
► రాయలసీమ అభివృద్ధికి మేం ముచ్చుమర్రి ప్రాజెక్టును మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఏం సాధించారు?
► అమరావతిలో రూ.10 వేల కోట్లతో 139 భవనాలు కట్టాం. వాటిని వినియోగించకుండా వదిలేశారు. 
► కరోనాపై జాగ్రత్తలు చెబితే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు వైరస్‌ వ్యాప్తిలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఏపీ ఉండే పరిస్థితి వచ్చింది. కరోనాను నియంత్రించలేక చేతులెత్తేశారు. 
► విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు? కరోనాపై నేను చెప్పినట్లు చేస్తే ఇంతమంది చనిపోయేవారు కాదు. 
► సమైక్యరాష్ట్రంలో విజన్‌–2020తో ముందుకెళ్లి అభివృద్ధి చేశాను. రాష్ట్ర విభజన తర్వాత విజన్‌–2029ని తయారు చేశాం. అలాంటి నంబర్‌వన్‌ రాష్ట్రాన్ని నంబర్‌ లాస్ట్‌ రాష్ట్రంగా మార్చారు. 
► అధికార వికేంద్రీకరణ అభివృద్ధికి దోహదం చేయదు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. 
► కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే విశాఖపట్నం వెళ్లిపోతానని మాట్లాడతారా. అది తప్పుడు నిర్ణయం. కోర్టులో కేసులు ఉన్నాయి. అయినా లెక్కలేదు. 
► సంక్షేమం కంటే పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

మరిన్ని వార్తలు