బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? 

25 Mar, 2023 12:45 IST|Sakshi

నమ్మక ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు అనే విషయం ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన వెన్నుపోటు రాజకీయాలు ప్రదర్శించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీజేపీలోకి చంద్రబాబు పంపించిన పచ్చ నాయకులు యాక్టివ్‌ మోడ్‌లోకి రాబోతున్నారు. సోము వీర్రాజును బూచిగా చూపించి ఏపీ బీజేపీని ఖాళీ చేయించే పని ప్రారంభించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ కాషాయ పార్టీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? 

అన్నం పెట్టిన వారికే సున్నం
తెలుగుదేశం పార్టీలో కరుడుకట్టిన నాయకులు కొందరు గత ఎన్నికల తర్వాత చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో ప్రవేశించారు. తమ స్వార్థం కోసం చేసిన తప్పులు, అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి పచ్చపార్టీ నుంచి కాషాయపార్టీలోకి ప్రయాణం చేశారు. వీరందరిని చంద్రబాబే తన కోవర్టులుగా పంపించారు. చంద్రబాబు కోటరీలోని సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వంటి అప్పటి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు.

ప్రజాప్రతినిధులు కాని మరికొందరు నాయకులు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా బీజేపీలోని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఒక పెద్దమనిషి సహకారంతోనే కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఏపీలో బీజేపీ ఎదగకూడదనే లక్ష్యంతోనే కొందరు చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలో పనిచేస్తున్నారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కూడా అటువంటి నేతలు బీజేపీని నిర్వీర్యం చేసే కార్యక్రమం ప్రారంభించినట్లు సమాచారం.

బీజేపీ రాష్ట్రంలో బలంగా ఎదిగితే టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకుంటుందనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. అందుకే కమలం పార్టీని బలహీనపరిచే కుట్రలకు తెలుగు బిజెపి నేతలు పాల్పడుతున్నారు. బిజెపిని బలహీనపరిచే ప్రక్రియలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పావుగా వాడుకుంటున్నారు. సోము వీర్రాజు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌తో కుమ్మకయ్యారంటూ ఎల్లో మీడియాతో కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిజెపి నేతలను ఒక్కొక్కరిగా టిడిపిలో జాయిన్ చేసేందుకు ఈ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువస్తున్నారు.

ఇవే ఆరోపణలు బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో చేయించి కన్నాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయించారు. ఇప్పుడు కన్నా తరహాలోనే మరి కొంతమందిని టిడిపిలోకి పంపించేందుకు పచ్చ బిజెపి నేతలు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో ముందుగా మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తరువాత బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వంటి పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మరో ఏడాదిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేనతో కలిసి కూటమి కట్టాలని పచ్చ నేతలు ఎప్పటినుంచో నానాపాట్లు పడుతున్నారు. అలా జరగలేదంటే బీజేపీలోకి వెళ్ళిన పచ్చ పార్టీ నాయకులు, మరికొందరు బీజేపీ నాయకులు టీడీపీలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని కాషాయ పార్టీ నాయకులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరిన్ని వార్తలు