‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం

25 Nov, 2021 11:47 IST|Sakshi
బలహీనమైన రాయలచెరువు కట్టపైన వాహనం ఎక్కి మాట్లాడుతున్న బాబు, పాపానాయుడుపేటలో కారు దిగకుండా వెళుతున్న చంద్రబాబు

అడుగడుగునా రాజకీయ విమర్శలు

పరామర్శ యాత్రలో సానుభూతి కోసం చంద్రబాబు ఆరాటం

రాయలచెరువు కట్టపై నానా హంగామా

బాధితుల్లో తమ్ముళ్లకే ప్రాధాన్యం 

ప్రసంగాల్లో పదేపదే తన సతీమణి ప్రస్తావన 

ఘనత వహించిన చంద్రబాబు మరోమారు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు.. ప్రమాదఘంటికలు మోగిస్తున్న రాయలచెరువు కట్టపై హంగామా చేశారు.. లీకేజీలను అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న అధికారుల విధులకు అడ్డంకులు సృష్టించారు.. ముమ్మరంగా సాగుతున్న మరమ్మతు పనులకు ఆటంకం కలిగించారు.. బలహీనమైన కట్టపైనే ప్రచార రథం ఎక్కి సుదీర్ఘంగా ప్రసంగంతో స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సైతం తెగించారు.

సాక్షి, తిరుపతి/తుడా: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు బుధవారం పర్యటించారు. ముందుగా రేణిగుంటకు చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాపానాయుడుపేటకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం గుడిమల్లం మార్గంలో స్వర్ణముఖి నదిపై కూలిపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం తిరుచానూరు చేరుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను సందర్శించారు. తర్వాత తొండవాడ మీదుగా రాయలచెరువు వద్దకు వెళ్లి కట్టను పరిశీలించారు. లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై ఇంజినీర్లను ఆరా తీశారు.

పరామర్శలు శూన్యం.. విమర్శలకే ప్రాధాన్యం 
వరద ప్రాంతాల్లో చంద్రబాబు చేపట్టిన పర్యటన తూతూ మంత్రంగా సాగింది. బాధితులను పరామర్శించడం వదిలేసి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడమే అజెండాగా మారింది. ఎక్కడా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను చూడలేదు. ధ్వంసమైన ఇళ్లను పరిశీలించలేదు. బాధితులను ఓదార్చి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నమూ చేయలేదు. కేవలం ఆత్మస్తుతి పరనింద అన్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం, అసెంబ్లీలో తన సతీమణిని అవమానించారంటూ సానుభూతి కోసం పాకులాడడమే లక్ష్యంగా  బాబు యాత్ర సాగింది.

తమ్ముళ్ల అత్యుత్సాహం 
అధినేత పర్యటనలో తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనంలో స్పందన లేకపోవడంతో బాబు ముందు పరువు పోతుందని తామే హంగామా సృష్టించారు. అది పరామర్శ యాత్ర అనే విషయం మరిచిపోయి బాణసంచా పేలుస్తూ, జైబాబు అంటూ నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. ఇది చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి మేము అవస్థలు పడుతుంటే ఓదార్చడం పోయి సంబరాలు జరుపుకుంటారా అని మండిపడుతున్నారు.

మారని ధోరణి 
తిరుపతిలోని  మహిళా వర్సిటీ, వైకుంఠపురం కూడళ్లలో చంద్రబాబు పాత ధోరణిలోనే ప్రసంగాలు సాగించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా తమ పార్టీ నేతల ఇళ్లకు మాత్రమే వెళ్లి పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదు నిముషాలు గడిపితే తన ప్రసంగాలకు మాత్రం గంటలకొద్దీ సమయం వెచ్చించారు.

రాయలచెరువుపై కట్టపై మీటింగ్‌ 
ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రాయలచెరువును అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కట్టను పటిష్టం చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువు వద్దకు చేరుకున్న బాబు కట్టపైనే మీటింగ్‌ పెట్టారు. ప్రచార రథమెక్కి ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు లంకించుకున్నారు. కట్ట పరిస్థితి బాగాలేదని అధికారులు వారించేందుకు యత్నించినా పెడచెవిన పెట్టారు. లీకేజీలను అరికట్టే పనులకు ఆటకం కలిగించారు. దీంతో కట్ట మరింతగా దెబ్బతింటుందేమో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అద్దె జనాలతో ‘షో’ 
చంద్రబాబు రోడ్‌షోకు జనాలు కరువయ్యారు. దీంతో టీడీపీ నేతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఎక్కడికక్కడ బాబు సభలకు అందుబాటులోని వాహనాలతో అద్దె జనాలను తరలించారు. కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలనే బాధితులుగా కూర్చోబెట్టి పరామర్శ యాత్రను మమ అనిపించారు. ఈక్రమంలో ప్రతి సభలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేశారు.  

మరిన్ని వార్తలు