మీకు చెప్పు చూపించాలి: ఊగిపోయిన చంద్రబాబు

19 Nov, 2022 07:45 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్‌ వాన్ని తన్ను.. రేయ్‌ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా.. దద్దమ్మ సీఎం.. పనికి మాలిన సీఎం.. రౌడీ సీఎం.. ఇదేమన్నా పులివెందుల అనుకుంటున్నావా?’ అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కర్నూలులో పర్యటిస్తూ.. కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని, అన్నీ ఒక్క అమరావతిలోనే ఉండాలని చెప్పడం భావ్యం కాదని విన్నవించడానికి వచ్చిన న్యాయవాదులు, విద్యార్థులను చూసి చంద్రబాబు ఇలా రెచ్చిపోయారు.  

అడుగడుగునా నిరసనలే 
మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు తొలిరోజు నుంచీ అడుగడుగునా నిరసన సెగ తగులుతూనే ఉంది. దేవనకొండ సర్కిల్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరులో బాబు పర్యటనకు అడ్డుపడిన న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నేతలు.. చివరి రోజు శుక్రవారం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఉదయం ఓ హోటల్లో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు మధ్యాహ్నం 2.40 గంటలకు టీడీపీ ఆఫీసుకు బయల్దేరారు. బుధవారపేటకు రాగానే ‘న్యాయ రాజధాని’ని కాంక్షించే ప్రజలు, విద్యార్థులు కాన్వాయ్‌కి అడ్డుతగిలారు.

అక్కడి నుండి కలెక్టరేట్‌ సర్కిల్‌కు రాగానే వందలాది విద్యార్థులు కాన్వాయ్‌కి  అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా లాగేశారు. అక్కడి నుండి గాయత్రి ఎస్టేట్‌లోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు చేరుకున్నారు. ఇక్కడ కూడా న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ సభ్యులతో పాటు కుల, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చి టీడీపీ ఆఫీసులోకి చొరబడే ప్రయత్నం చేశారు. నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. నల్లజెండాలు చేతపట్టుకుని, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని ప్ల్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. చంద్రబాబు వీరందరినీ చూస్తూ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘మన ఏకైక రాజధాని అమరావతే. తమ్ముళ్లూ ఇదే విషయం వారికి చెప్పండి. వారిని తన్నండి.. బట్టలూడదీసి కొట్టండి. మీ చేతకాకపోతే నేను వస్తా.. వారి కథ తేలుస్తా’ అని కార్యకర్తలను రెచ్చగొట్టారు.   దీంతో టీడీపీ శ్రేణులు అమరావతే రాజధాని అంటూ నినాదాలు చేశాయి. 

రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు 
చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబు..  వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో జేఏసీ నేతలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దశలో పోలీసులతో పాటు జిల్లా ఎస్పీపై కూడా చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ‘పోలీసులూ నిద్రపోండి. మీరు బట్టలిప్పేయండి. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం. ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తున్నారు? రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్‌ ఇచ్చిందే దండగ’ అంటూ పరుష పదజాలంతో దూషించారు.  

మందు, బిర్యానీ ఇచ్చింటారు.. 
‘ఇది పేటీఎం బ్యాచ్‌.. క్వార్టర్‌ మందు, బిర్యానీ ఇస్తారు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా వీరందరికీ క్వార్టర్, బిర్యానీలు ఇచ్చి ఉంటారు’ అని చంద్రబాబు.. జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఇతర సంఘాల నేతల ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడారు. ‘నేను పార్టీ ఆఫీసుకు వస్తే నలుగురు వచ్చి బెదిరించాలని చూస్తారా? రౌడీయిజాన్ని అణిచివేస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. నేను కుప్పానికి వెళ్లినా రౌడీలను తీసుకొస్తున్నారు. ఎక్కడికి వస్తారా? నన్ను రాయలసీమ ద్రోహి అంటారా? రాయలసీమను రతనాల సీమగా మార్చే పార్టీ టీడీపీ. రాయలసీమను దోపిడీ చేసిన వ్యక్తి జగన్‌. కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుని నువ్వు రాజకీయం చేస్తావా? మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా ప్రాణాన్ని లెక్క చేయను. 23 బాంబులకే భయపడలేదు. నేను కనుసైగ చేస్తే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు బట్టలు ఊడదీయిస్తారు. పోలీసు వ్యవస్థ నాశనమైంది. పతనమైంది. నా పర్యటనలకు వస్తున్న స్పందన చూసి వైఎస్సార్‌ సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే నన్ను అడ్డుకోవాలని ఐదు, పది మంది వస్తున్నారు. మా తమ్ముళ్లు కన్నెర్ర చేస్తే వీరు పారిపోవడం ఖాయం. కర్నూలును అభివృద్ధి చేసింది నేనే’ అని చెప్పుకొచ్చారు.  

నువ్వా.. మూడు రాజధానులు నిర్మించేది? 
‘టిడ్కో ద్వారా 10 వేల ఇళ్లు ఇచ్చా. చేతనైతే వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వు. 90 శాతం నేను పూర్తి చేస్తే 10 శాతం పూర్తి చేయలేకపోయావు. 10 శాతం ఇళ్లు పూర్తి చేయలేని నువ్వు మూడు రాజధానులు కడతావా? ఏమి మనిషివయ్యా.. నీ పుట్టుకే అబద్ధాల పుట్టుక. నీ చరిత్రే నేర చరిత్ర. నేరగాళ్లను పట్టుకునే పార్టీ టీడీపీ. జగన్‌ అమరావతి రాజధానిగా ఒప్పుకున్నాడా? లేదా? ఓడిపోతాననే పిరికితనంతో ఇప్పుడు మూడు ప్రాంతాల్లో చిచ్చుపెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలనుకుంటున్నావు. నాలుగేళ్ల నీ పాలనలో ఒక్క రూపాయి పనైనా కర్నూలులో చేశావా? మద్యం, భూములు, భూగర్భ సంపద మీకే కావాలి. పేరు రాయలసీమది, దోపిడీ జగన్‌ది’ అంటూ సీఎంపై నోరు పారేసుకున్నారు. నాతో ఎవరైనా పెట్టుకుంటే అదే వారికి చివరి రోజు. రాజశేఖరరెడ్డి లాంటోళ్లే నాతో పెట్టకోలేదు. వీరెంత.. అవసరమైతే కర్నూలులోనే బస చేస్తా.. ఎవరెవరు ఏం చేశారో చెబుతా.. నువ్వేం చేశావో చెప్పే ధైర్యం ఉంటే పేపర్‌కు ఇవ్వు.. నేనేం చేశానో ఇస్తా.. కర్నూలు ప్రజలే నిర్ణయిస్తారు. రాయలసీమలో ముఠా నేతలను అణిచి వేసిన పార్టీ టీడీపీ’ అని అన్నారు. అంతకు ముందు ఆయన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని, తాండ్రపాడులోని చెరువును పరిశీలించారు. 

చదవండి: (మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు)

మరిన్ని వార్తలు