మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను తగ్గిస్తాం

3 Mar, 2021 05:22 IST|Sakshi

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 

సాక్షి, అమరావతి: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి ఆస్తి పన్ను పెంచుతుందని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే దానిని తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలపై టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు.

జగన్‌కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను రిజిస్ట్రేషన్‌ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా ఈ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులను కిడ్నాప్‌ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయన్నారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. భయపడి నామినేషన్లు వెనక్కుతీసుకోవడం పిరికిచర్య అన్నారు. 

రేపటి నుంచి బాబు ప్రచారం 
గురువారం నుంచి తాను మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరు జిల్లాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తానని చెప్పారు.  

మరిన్ని వార్తలు