ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?

31 Jul, 2022 18:36 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాపు నేస్తం సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ స్పందిస్తారా?లేదా? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూసి ఉంటారు. కానీ ప్రతిపక్షం వైపు నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదంటేనే జగన్ ఈ విషయంలో సఫలం అయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తలలో ఉండడానికి ఇష్టపడే చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై ఎందుకు మాట్లాడలేదు. ప్రభుత్వం చేసే కార్యక్రమానికి పోటీగా ఏదో ఒకటి చేసే టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? అంటే దాని అర్థం అనవసరంగా కెలుక్కుని నష్టపోవడం ఎందుకు అని అయినా అనుకుని ఉండాలి? లేదా వారి దగ్గర సమాధానం అయినా ఉండి ఉండకపోవాలి.
చదవండి: ‘ఈనాడు’ ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోంది?

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాపు సామాజికవర్గం కూడా బాగానే ఉపయోగపడిందని అంగీకరించాలి. దానికి కారణం జనసేన పార్టీని స్థాపించిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్‌ తాను పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆయనపై ఉన్న ఆ వర్గంలో ఉన్న అభిమానం చంద్రబాబు కాష్ చేసుకోగలిగారు. దీనికి తోడు కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా ఉండనే ఉంది.

తీరా అధికారంలోకి వచ్చాక కాపుల పట్ల చంద్రబాబు అనుసరించిన వైఖరి వారిలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్‌ల అంశంపై చేసిన ఉద్యమాన్ని ఎలా అణచాలా అన్నదానిపైనే ఆయన దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా , కాపులను బీసీలలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన విఫలం అయ్యారు. పైగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌లో ఐదు శాతం కాపులకు ఇస్తామని కొత్త ఆలోచన చేశారు. అది చెల్లదని తెలిసినా ఆయన ప్రయత్నం చేసి చివరికి భంగపడ్డారు.

కాపు సామాజికవర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం ఘోరంగా దెబ్బతినిపోయింది. కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. వామపక్షాలతో కలిసి పోటీచేసిన జనసేనకు ఒక సీటు మాత్రమే దక్కింది. మిగిలిన సీట్లన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్ ఖాతాలో జమ అయ్యాయి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ ఇష్యూలో తాను హామీ ఇవ్వలేనని చెప్పడం ద్వారా అటు కాపు వర్గాన్ని, ఇటు బీసీ వర్గాన్ని ఆకట్టుకోగలిగారు. కాపులకు ఏటా రెండు వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు. అదే ప్రకారం ఆయన అడుగులు వేశారు.

చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చలేకపోయారు. మూడువేల కోట్ల వరకే ఇవ్వగలిగారు. మరి జగన్ ఆ విషయంలో వివిధ స్కీముల కింద మూడేళ్లలోనే 32 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చానని గొల్లప్రోలులో జరిగిన సభలో ప్రకటించారు. దీనిని పూర్వ పక్షం చేయడానికి టీడీపీ ఎంతవరకు ప్రయత్నించింది తెలియదు. కానీ ఆ సభలో ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చిన స్పందన చూస్తే కాపు పేద మహిళలలో కూడా జగన్ నమ్మకం సాధించారన్న అభిప్రాయం కలుగుతుంది.

45 ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి పేద కాపు మహిళకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా వారిలో ఒక నమ్మకం పెంచగలిగారు. పలువురు ఈ డబ్బును స్వయం ఉపాధికి కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు టైమ్‌లో  ఈ రకంగా నిర్మాణాత్మక ప్రయత్నం జరిగినట్లు అనిపించదు. కాపు కార్పొరేషన్ ద్వారా కొంతమందికి రుణాలు ఇచ్చినట్లు టీడీపీ చెబుతుంది. కానీ జగన్ ఏకంగా ఆ వర్గం మహిళలకు భారీ ఎత్తున ఉచిత ఆర్థిక సాయం చేయడంతో రుణాలకు విలువ లేకుండా పోయింది. ఇంకో పోలిక కూడా గమనించాలి. కాపులకు ఒక భవనం నిర్మిస్తామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. అది ఏ దశలో ఉందో తెలియదు కాని, దానికి చంద్రన్న కాపు భవన్ అని పేరు పెట్టే యోచన చేయడంతో ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

దాంతో ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది. అదే కాపు నేస్తం స్కీంకు  జగనన్న కాపు నేస్తం అని పేరు పెట్టినా వారెవ్వరూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది నేస్తం పథకం కనుక. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వెళితే చంద్రబాబు వ్యూహలోపంతో నష్టపోయారని అనుకోవచ్చు. ఈ జిల్లాలలో తన పరపతి మళ్లీ పెంచుకోవడానికి పవన్ కల్యాణ్‌ చేస్తున్న కృషికి గండి కొట్టేలా జగన్ తన వంతు ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. చంద్రబాబు ఇప్పటికీ నేరుగా పవన్‌తో రాజకీయ సంబంధాలు పెట్టుకోకపోయినా, పరోక్షంగా వారిద్దరూ కలిసే ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఎవరూ ఆశ్చర్యపోరు. దానివల్ల కాపుల ఓట్లు గణనీయంగా వచ్చి రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ వ్యూహానికి ప్రతిగా జగన్ నేరుగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాపు వర్గంలో ఆలోచనకు ఆస్కారం ఇవ్వవచ్చు. కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి వాటన్నిటిని హోల్ సేల్‌గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం అని జగన్ వ్యాఖ్యానించారు.

దీనిని కూడా టీడీపీ, జనసేనలు ఖండించలేకపోతున్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో టీడీపీ, జనసేనలు కలిసే అవకాశం ఉండడంతో దానిని తోసిపుచ్చలేకపోతున్నారు. ఈ పాటికే ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే తమ నేత అమ్ముడుపోలేదని, కాపుల పక్షాన పవన్ నిలబడతారని చెప్పుకునేవారేమో! కొద్ది రోజుల క్రితం ఆయా సభలలో పవన్ మాట్లాడుతూ కాపులకు కూడా ఆ భావన లేకుండా పోయిందని, వారు కూడా జగన్‌కే మద్దతు ఇస్తున్నారని బాధపడ్డారు. గతంలో ఆయన అసలు కాపులేమిటి? రిజర్వేషన్ ఏమిటి అని ప్రశ్నించిన సందర్భమూ ఉంది. దీంతో ఆయన నిలకడ లేని వ్యక్తి అన్న భావన ఏర్పడింది.

ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన హామీలను విశ్వసించిన ఆ వర్గంలో మెజార్టీ మద్దతు లభించింది. ఇప్పటికే పలు బలహీనవర్గాలు జగన్‌కు మద్దతు ఇస్తున్నాయి. కాపులు కూడా అదే ప్రకారం తమ సపోర్టును కొనసాగిస్తే టీడీపీ, జనసేనలకు భవిష్యత్తు ఉండడం కష్టం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాపులను హోల్ సేల్ గా అమ్మేయడానికి పవన్ కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జగన్ ఆరంభించారు. ఇదే టైమ్‌లో ఆయా అంశాలను ప్రస్తావించి తాను నిజాయితీగా మాట్లాడతానని, చెప్పినవాటిని అమలు చేస్తున్నానని, అలాంటి పాలన కావాలా? చంద్రబాబు చేసే అబద్దాల పాలన కావాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ఏఏ అబద్దాలు ఆడింది సోదాహరణంగా ప్రజలకు చెబుతున్నారు. కానీ చంద్రబాబు వాటికి ప్రత్యక్షంగా సమాధానాలు చెప్పకుండా జగన్‌పై ఏవేవో ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు తాను కాపు కాస్తానని జగన్ ప్రకటించి వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. కాపులలోని పేద వర్గాలవారు కూడా జగన్ తమను కాచుకుంటున్నారనే భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను బట్టి అర్ధం అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్‌లు ఎలాంటి వ్యూహం అమలు చేసి తామే కాపులను ఉద్దరించగలుగుతామని చెప్పగలుగుతారో చూడాలి. కాకపోతే ఐదేళ్లపాటు చేయలేని వ్యక్తి ఇప్పుడు చేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. జగన్ తాను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నందున ధైర్యంగా కాపు కాస్తానని చెప్పగలుగుతున్నారా!


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు   

మరిన్ని వార్తలు