రాళ్లేసిన కూలీలకు రాజభోగం

22 Oct, 2021 03:01 IST|Sakshi

అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి చేసిన వారికి చంద్రబాబు అందలం

2018లో కుటుంబంతో శ్రీవారిని దర్శించుకుని వస్తున్న అమిత్‌ షా

అలిపిరి వద్ద కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో టీడీపీ మూకల దాడి

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్న చంద్రబాబు

తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని స్పష్టీకరణ..

ముగ్గురిపై కేసులు పెట్టినట్లే పెట్టి.. ఇద్దరిపై ఎత్తివేత

దాడికి పాల్పడిన వారిలో ఇద్దరి కుటుంబ సభ్యులకు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ టికెట్లు

మిగతా వారికి పార్టీ పదవులు.. ఇతరత్రా లబ్ధి కల్పించిన వైనం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ నేత పట్టాభి ద్వారా చంద్రబాబు సభ్య సమాజం తల దించుకునేలా తిట్టించడంతో కడుపు మండిన కొందరు అభిమానులు టీడీపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అందరికీ తెలుసు. అయితే ఈ ఘటనపై చంద్రబాబు నానాయాగీ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకి ఫోన్‌లో ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. ఆయన్ను నేరుగా కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా అడిగానని చెప్పారు. ఈ నేపథ్యంలో సరిగ్గా మూడున్నరేళ్ల కిందట అదే అమిత్‌షాపై దాడికి ఉసిగొల్పింది ఇదే చంద్రబాబే కదా అని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

2018 మే 11వ తేదీన అప్పటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, జెడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న అమిత్‌ షా కుటుంబంతో సహా తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి వస్తుండగా అలిపిరి గరుడ సర్కిల్‌ వద్ద ఆయన కాన్వాయ్‌పై టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ సాకుతో అమిత్‌ షా పర్యటనలో టీడీపీ మూకలు ఉద్రిక్తత సృష్టించాయి. టీడీపీ నేతల ఆగడంపై బీజేపీ నేతలు అదే రోజు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. 

బాబు ఆదేశాల మేరకే నాడు దాడి జరిగిందన్న బీజేపీ నేతలు
అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఆయనకు పూర్తిగా తెలిసే టీడీపీ నేతలు అమిత్‌ షాపై దాడికి పాల్పడ్డారని ఆ రోజు బీజేపీ నేతలు సోము వీర్రాజు, భాను ప్రకాష్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, విష్ణుకుమార్‌ రాజు తీవ్రంగా విమర్శించారు. 

ఇలా చెప్పారు..
అమిత్‌షా కాన్వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్‌షా పర్యటనలో నిరసన తెలపాలని పార్టీ ఎవరికీ చెప్పలేదు. ఏ సమయంలో ఎలా స్పందించాలనేది గుర్తుంచుకోవాలి. మన పోరాటంలో ఉద్రిక్తతలకు తావులేదు. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఇలా జరగడం సరికాదు. విషయం తెలిసిన వెంటనే బాధ్యులైన వారిని మందలించాం. ఈ దాడిలో పాల్గొన్న వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం.

 ఇలా చేశారు..
కాన్వాయ్‌పై దాడి పక్కాగా జరిగేలా మంతనాలు చేసింది చంద్రబాబే. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి జరగాలన్నది శ్రేణులకు దిశా నిర్దేశం చేసిందీ ఆయనే. ‘మంచి పనయింది.. బాగా చేశారు..’ అంటూ ముఖ్య నేతల వద్ద ప్రశంసించారని అప్పట్లో ఆ పార్టీ వర్గాలే గొప్పగా చెప్పుకున్నాయి. దాడి చేసిన వారిలో ముఖ్యులను తప్పించి ముగ్గురిపై కేసులు పెట్టారు. ఆ కేసులూ ఏం కావంటూ భరోసా ఇచ్చారు. తర్వాత ఇద్దరిపై కేసులు ఎత్తేశారు. సస్పెండ్‌ చేస్తామన్న మాటను అటకెక్కించారు. పైగా దాడిలో పాల్గొన్న ఇద్దరి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్‌గా టికెట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. మిగతా వారికి వ్యాపార పరంగా, పార్టీ పరంగా మేలు చేశారు. 

దాడికి సత్కారం
► నాటి టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడు దంపూరు భాస్కర్‌ యాదవ్, నాటి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు బీఎల్‌ సంజయ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ వర్మ, పార్టీ ఉపాధ్యక్షుడు గుణశేఖర్‌ నాయుడు తదితరులు ఈ దాడికి నాయకత్వం వహించారు. వీరిపై కేసు కూడా పెట్టలేదు. ఇక ఆ తరవాత శ్రీధర్‌ వర్మ భార్య జ్యోత్స్నకు కార్పొరేషన్‌ ఎన్నికల్లో 15వ డివిజన్‌ నుంచి టిక్కెట్‌ ఇచ్చారు. సంజయ్‌ కుమార్తె కీర్తికి 19వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ టికెట్‌ ఇచ్చారు. 
► బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు.. సుబ్బు, రవి, ఆనంద్‌గౌడ్‌ అనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై 138 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలోనూ ఒక్క సుబ్బుపై (సుబ్రహ్మణ్యం) మాత్రమే కేసును ఉంచి తూతూ మంత్రంగా విచారణ ముగించేశారు. మిగిలిన ఇద్దరినీ కేసు నుంచి తప్పించారు.  
► ఈ ఇద్దరిలో ఆనంద్‌గౌడ్‌ అప్పటిదాకా కార్యకర్త మాత్రమే. ఈ సంఘటన తరవాత చంద్రబాబు మెచ్చుకుని తెలుగు యువత నగర అధ్యక్షుడిని చేశారు. ఇక స్థానిక టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా ఉన్న రవి నాయుడికి తెలుగు యువత తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఎంతైనా రాళ్లేసిన కూలీలు కదా?  

మరిన్ని వార్తలు