అచ్చెన్నపై యూటర్న్‌

28 Sep, 2020 05:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: యూటర్న్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అదే బాట పట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపైనా యూటర్న్‌ తీసుకున్నారు. పార్టీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడికి ఈ పదవి ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి చివరి నిమిషంలో ఆ నియామకాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. దీని వెనుక అంతర్గతంగా పెద్ద తతంగమే నడిచిందని పార్టీలో చర్చ జరుగుతోంది. (చదవండి: పార్లమెంట్‌ స్థానాలవారీగా టీడీపీ అధ్యక్షులు)

► పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై టీడీపీలో ఏడాదిగా తర్జన భర్జన సాగుతోంది.  అచ్చెన్నాయుడి పేరు తెరపైకి వచ్చినా లోకేష్‌ తనకు సన్నిహితుడైన కింజరపు రామ్మోహన్‌నాయుడి పేరును ప్రతిపాదించారు. ఈ వ్యవహారం కింజరపు కుటుంబంలో విభేదాలకు దారి తీసినట్లు పార్టీలో ప్రచారం జరిగింది. అనంతరం అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని సానుభూతి పొందేందుకు అచ్చెన్నను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు తన అనుకూల మీడియాకు లీకులిచ్చారు. అయితే చివరి నిమిషంలో మళ్లీ లోకేష్‌ అడ్డుపడినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్ర, జాతీయ కమిటీల నియామకాన్ని నిలిపివేశారు. దసరాకి వీటిని ప్రకటించనున్నట్లు లీకులిచ్చారు. 

>
మరిన్ని వార్తలు