ప్లీజ్‌.. తమ్ముళ్లూ ప్లీజ్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు 

1 Oct, 2022 08:19 IST|Sakshi

పార్టీ ఇన్‌చార్జిలతో సమావేశాలు 

నియోజకవర్గాల్లో పని చేయాలని వేడుకోలు

అయినా స్పందించని నేతలు 

ఎంత పనిచేసినా గెలవలేమనే ముఖ్య నేతల వెనకడుగు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధఃపాతాళానికి కూరుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణ ఓటములు. విపక్ష పార్టీగా అన్నీ వైఫల్యాలు.  పార్టీ, అగ్రనేతలపై జనం ఏవగింపు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న నేతలు. నియోజకవర్గాల వైపు చూడని వైనం. ఏతావాతా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబులో తీవ్ర ఆందోళన. దయచేసి నియోజకవర్గాలకు వెళ్లాలని వేడుకొంటున్నారు. వారిని పిలిచి బుజ్జగిస్తున్నారు.
చదవండి: టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్‌ రవి

పార్టీ కోసం పనిచేయాలని, మున్ముందు పార్టీకి ఊపు వస్తుందని నమ్మబలుకుతున్నారు. అయినా నేతల్లో పెద్దగా మార్పు కనిపించడంలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక ఎన్నికల దెబ్బకు టీడీపీ ముఖ్య నేతలందరూ ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. మూడేళ్లుగా వారంతా స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు మరీ ఒత్తిడి తెస్తే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, తాము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తనకు అనుకూలం గా ఉండే ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా ద్వారానే చంద్రబాబు పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు.

రకరకాల అంశాలపై ఆందోళనలు చేయాలని ఇస్తున్న పిలుపులకు కూడా పార్టీ నేతల నుంచి అస్సలు స్పందన ఉండడంలేదని సమాచారం. బాదుడే బాదుడు పేరుతో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పదేపదే చెప్పినా నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. మీడియాలో కనపడటం కోసం చేసే హడావుడి తప్ప ప్రజల్లోకి వెళ్లడంలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లిస్తామనే పల్లవి అందుకున్నారు. యువతను ప్రోత్సాహించేందుకు ఈ నిర్ణయమని బయటకు చెప్పుకుంటున్నా.. నాయకుల కొరత వల్లే నిర్ణయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల్లో స్పందన కరువు
ఈ మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలకు కనీసం సగం నియోజకవర్గాల నుంచి కూడా స్పందన రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 నియోజకవర్గాలకుగాను 70కి పైగా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలే లేరు. కొన్నిచోట్ల ఇన్‌చార్జిలు ఉన్నా అలంకారం కోసమే. కృష్ణా జిల్లా గన్నవరం ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అసలు నియోజకవర్గానికి వెళ్లడమే లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బాధ్యుడి నియామకమే జరగలేదు. టీడీపీకి పట్టున్నట్లుగా చెప్పుకునే ఈ రెండు కీలక నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి అనేక మంది నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా

ఉంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు చేయించిన సర్వేల్లో కూడా తేలినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 4 నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సమావేశమవుతున్నారు. పారీ్టకి మంచి భవిష్యత్తు ఉందని, నియోజకవర్గంలో పనిచేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆందోళనలు చేయాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ మీదేనంటూ ఇన్‌చార్జిలకు హామీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 60కి పైగా నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయినా, పెద్దగా ఉపయోగం కనిపించడంలేదని, చంద్రబాబు ఎంత బతిమిలాడినా భవిష్యత్తుపై నమ్మకం లేక ముఖ్య నేతలు నియోజకవర్గాలకు రావడంలేదని కొందరు నేతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు