దిగజారిన ప్రతిపక్షం, ఎల్లో మీడియా

8 Sep, 2022 03:51 IST|Sakshi

సీఎం, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే వారి అజెండా: మంత్రి చెల్లుబోయిన 

సాక్షి, అమరావతి: ప్రతిపక్షాలు, వాళ్లకు కొమ్ముకాస్తున్న కొన్ని మీడియా సంస్థలు మరింత హీన స్థితికి దిగజారి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే ప్రధాన అజెండాగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బుధవారం ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు వెల్లడిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జగన్‌ సీఎం కాక ముందు కూడా 2011 నుంచే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా వైఎస్‌ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే తప్పుడు ప్రచారం కొనసాగించాయని గుర్తు చేశారు. రాజకీయాల జోలికేరాని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి గురించి కొత్తగా ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని తప్పుబట్టారు. చంద్రబాబు అసెంబ్లీలో తన భార్యను ఎవరో ఏదో అన్నారని విలేకరుల సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారని.. అసలు చంద్రబాబు భార్యను ఎవరు ఏమన్నారో కూడా తెలియని పరిస్థితుల్లోనే అంతగా బాధపడిన ఆయన.. ఇప్పుడు ముఖ్యమంత్రి భార్య గురించి తప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. 

లిక్కర్‌కు అనుమతులిచ్చింది బాబే
ఎవరి హయాంలో ఎవరెవరికి మద్యం అనుమతులు మంజూరు చేశారన్నది మర్చిపోయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం అనుమతులు మంజూరు చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి అనుచరులకు మద్యం కంపెనీల అనుమతులు మంజూరు చేశారన్నారు.

చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏమి చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తూర్పారపట్టారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడన్నా ప్రజలు ఏదైనా కావాలని అడిగితే.. అది ప్రభుత్వ వ్యతిరేకమన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఆనందం పొందుతుండటం విడ్డూరం అన్నారు.  

మరిన్ని వార్తలు