బీసీల ద్రోహి చంద్రబాబు

19 May, 2022 05:29 IST|Sakshi

బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి టికెట్లిచ్చావు

వారిని ఏకంగా రాజ్యసభ సభ్యులుగా చేశావు

కేంద్రంలో బీజేపీ రావడంతో మళ్లీ రాజకీయం

ఒకేసారి నలుగురు ఎంపీల కండువా మార్పించావు

ఇంతకూ మీరు ఉంటున్నది తెలంగాణలో కాదా? 

చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

రాయచోటి/ సాక్షి, అమరావతి:  ‘చంద్రబాబూ.. ఏ ముఖం పెట్టుకుని రాయలసీమకు వచ్చావు? ఎక్కడ ఏం జరిగినా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్‌ అని విమర్శించే నీవూ సీమలోనే పుట్టావన్న విషయం మర్చిపోయావు. నీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశావా? అన్ని వర్గాల వారికి మేము మేలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే నీ పని. ఇప్పటికే బీసీ ద్రోహిగా ముద్ర వేసుకున్నావు.

ఇకనైనా పద్ధతి మార్చుకో’ అని సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. బుధవారం వారు తాడేపల్లి, రాయచోటిలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ముంచేసి, ఆ డబ్బులు తనకు తెచ్చిచ్చిన వారికి ఒకప్పుడు రాజ్యసభ సీట్లిచ్చిన చంద్రబాబు చరిత్ర అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.

చంద్రబాబు తన చరిత్ర మరచి ఇవాళ సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ‘ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లు ఇస్తే.. పక్క రాష్ట్రం అంటూ నసుగుతున్నాడు. కృష్ణయ్య తెలంగాణకు చెందిన వారైనా, బీసీల సంక్షేమం కోసం దాదాపు 40 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పో రాడుతున్నారు. తన పార్టీలో ఉంటేనేమో కృష్ణయ్య గొప్ప వాడు. వైఎస్సార్‌సీపీలో ఉంటే ప్రక్క రాష్ట్రం వాడి కింద లెక్కలోకి వస్తాడు. ఇంతకూ మీరు నివాసం ఉంటోంది తెలంగాణలోనే కదా?’ అని నిప్పులు చెరిగారు. వారు ఇంకా ఏమన్నారంటే..

ఎంపీలను బీజేపీకి తాకట్టు పెట్టావుగా..
► బ్యాంకులను ముంచేసిన వారిని రాజ్యసభ సభ్యులుగా చేసిన చంద్రబాబు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే, భయపడి.. గంపగుత్తగా వారందరినీ బీజేపీలోకి పంపించారు.  
► పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్‌ రెడ్డితో డబ్బుల మూటలు మోయించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేçస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి, రాత్రికి రాత్రి కరకట్టకు పరుగెత్తుకుంటూ వచ్చావు. అలాంటి చంద్రబాబు ఇవాళ పక్క రాష్ట్రం వారని మాట్లాడుతున్నారు.
► ఇవాళ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన సామాజిక న్యాయం దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు బీసీలు. అన్ని రాజకీయ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం గుర్తుంచుకోవాలి.

మీరు కట్టిందేమిటి?
► పులివెందుల బస్టాండ్‌ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా? అని ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాట్లాడటంలో అర్థం లేదు. పులివెందులలో అతి పెద్ద బస్టాండ్‌ త్వరలో పూర్తవుతుంది. అసలు మీరు కట్టిందేమిటి?  
► అమరావతిని పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూపించి మభ్య పెట్టావు. చివరకు కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సీఎం జగన్‌ పూర్తి చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కట్టకుండా అడ్డుకుంది మీరు కాదా?
► మేము మూడు రాజధానులు కడతాం. మీకు స్వాగతించే ధైర్యం ఉందా? నిజానికి మీరు ఆ ఐదేళ్లలో సొంత రాష్ట్రంలో కాకుండా తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ.250 కోట్లతో సొంత భవనం మాత్రమే కట్టుకున్నారు. అమరావతి రాజధాని అంటున్న మీరు అక్కడ మాత్రం ఇల్లు కట్టుకోలేదు.  

వీపు పగలగొడతారని భయం..
► దేశ వ్యాప్తంగా డీజిల్‌ ధరలు, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ ధరలు, ఎరువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరగటానికి కారణం ఎవరు?  బీజేపీని ఏమైనా అంటే వీపు పగలగొడతారని భయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మీదపడి ఏడుస్తున్నారు. ఇలాం టి ప్రతిపక్ష నేత ఉన్నందుకు మనం సిగ్గుపడాలి.
► గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న స్పందన చూసి మీకు వణుకు పుడుతోంది. అక్కడక్కడ మీ పచ్చ బ్యాచ్‌ ఎవరైనా మాట్లాడితే రాక్షసానందం పొందుతున్నారు. 
► గత మూడేళ్లలో మా ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి రూ.1.40 లక్షలు జమ చేసింది. ఇలా మీరు ఎంత చేశారో చెప్పగలరా? మీ హయాంలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసి, రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌ పెట్టి పోయారు. ఇప్పుడు సీఎం జగన్‌ ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఆపేయమంటారా? 

భవిష్యత్‌ ఉండదనే బెంగ
► ఒంగోలులో మహానాడుకు ఎవరో అడ్డుపడ్డారంటారు. జనం రారని భయంతో మీరే వేదిక మార్చుకున్నారు. దీనికీ మాపైనే ఏడుపా? రోజూ శ్రీలంక.. శ్రీలంక అంటూ కలవరింపులు. మీరు ఆ దేశానికి వెళ్లి అక్కడే సెటిలైతే మంచిది.  
► ఇన్నేళ్ల నీ పరిపాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి అయినా మేలు చేశావా? ముస్లింల మీద దేశద్రోహం కేసులు పెట్టావు,. మత్స్యకారులను, నాయీబ్రాహ్మణులను అవమానించావు. చివరకు రాయలసీమ వాసులనూ అవమానించావు. అందుకే నీవు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. 
► గతంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఇప్పుడు బీద మస్తాన్‌ రావు, ఆర్‌ కృష్ణయ్యలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి సీఎం జగన్‌ గౌరవించారు. యావత్తు బీసీ ప్రపంచం ఆనంద పడే రోజు ఇది. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో 15 మందికి స్థానం కల్పించారు. ఇందులో పది మంది బీసీలున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మంది లేరు. బీసీలకు సీఎం జగన్‌ చేసిన మేలుతో ఇక తనకు భవిష్యత్తు ఉండదనే బాధ, బెంగతో చంద్రబాబు ఇష్టానుసారంగా 
మాట్లాడుతున్నారు.  

మరిన్ని వార్తలు