ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం

3 Oct, 2021 05:15 IST|Sakshi

పవన్‌వి దిగజారుడు రాజకీయాలు 

రోడ్లు ఎప్పుడు వేస్తారో ఆయనకు తెలీదు 

పన్నెండేళ్లుగా ఎమ్మెల్యే కాలేదనేది ఆయన బాధ 

గాంధీ జయంతి రోజున గాడ్సే వారసుడిలా ప్రసంగం 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శ 

కాకినాడ సిటీ: ఒక పార్టీకి అధినేతగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాక.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చే ఎన్నికల్లో ప్యాకేజీని పెంచుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ను ఇప్పటి నుంచే తాపత్రయం పడుతున్నాడని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పవన్‌ జిల్లాలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. దేశానికి అహింస, సత్యం మార్గాలను చూపించిన గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల పుట్టినరోజు నాడు పవన్‌కళ్యాణ్‌ రాజమహేంద్రవరం వచ్చి ప్రజలను రెచ్చగొట్టి ఒక అసాంఘిక శక్తిగా యుద్ధ వాతావరణం తీసుకొచ్చి మాట్లాడడం చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు.

ఆయన తీరును ఏ ఒక్కరూ హర్షించరని, ప్రజలు తిప్పికొడతారని మంత్రి అన్నారు. ఒక సీజనల్‌ రాజకీయ నాయకుడిగా ఉంటున్న పవన్‌కు రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలీదని ఎద్దేవా చేశారు. శ్రమదానం అంటే పవన్‌ దృష్టిలో క్లాప్, కెమెరా, యాక్షన్‌.. ఒక నిమిషం పాటు పార పట్టుకుని ఫొటోలు దిగడం.. ఆ తర్వాత ప్రజలను రెచ్చగొట్టడమేనని చెల్లుబోయిన వేణు అన్నారు. రాజకీయాల్లో పుష్కరకాలం పనిచేసినా ఎమ్మెల్యే కాలేదన్న బాధ పవన్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.  

పనులు ప్రారంభమవుతున్నాయని తెలిసే.. 
వర్షాకాలంలో ఎక్కడా రోడ్లు వేయరన్న విషయం కూడా జనసేనానికి తెలియకపోవడం శోచనీయమని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించిందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయని తెలిసే రోడ్డుపై శ్రమదానం చేశారన్నారు. ఇటువంటి చిల్లర మనస్తత్వం కేవలం చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్‌కు మాత్రమే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి వేణు వ్యాఖ్యానించారు.

పవన్‌ మాటలు చూస్తే గాంధీ జయంతి నాడు గాడ్సే వారసుడులా మాట్లాడుతున్నట్లు ఉందన్నారు. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజలకు భరోసా ఇవ్వడానికి వచ్చాననడంపై మంత్రి మాట్లాడుతూ.. శెట్టిబలిజలకు మీ భరోసా ఏంటో గత ఎన్నికల్లోనే తెలిసిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో శెట్టిబలిజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర అగ్రవర్ణాలకు ఒకరితో ఒకరికి ఎలాంటి ఇబ్బందిలేదని, అందరూ ఐక్యంగానే ఉన్నామన్నారు. పవన్‌ వల్ల బాగుపడిన కాపులు ఎవరూ లేరన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు