కాంగ్రెస్‌ గూటికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

7 Oct, 2020 04:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేత, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. మంగళ వారం తన అనుచరులతో కలసి గాంధీ భవన్‌కు చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి వెంట తరలివచ్చిన అనుచరులను ఉద్దేశించి ఉత్తమ్, పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయ కులు సంపాదించిన అవినీతి డబ్బుతో దుబ్బాక ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచేందుకు వస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు.

మంత్రి హరీశ్‌రావు దుబ్బాకలో తానే అభ్యర్థినని చెప్తున్నారని, ఎమ్మెల్యేలకు వ్యక్తిత్వం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేశారని, ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థిపై బుధవారం ప్రకటన చేస్తామని ఉత్తమ్‌ వెల్లడించారు. కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని, దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ నైతికంగా ఓడిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేరును బుధవారం పార్టీ ప్రకటన చేస్తుందన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవానికి సంబంధించినదని, దుబ్బాకకు కనీసం బస్సు, నీళ్లు లేని పరిస్థితుల్లో తన తండ్రి అభివృద్ధి చేశారని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పల్లెలు నగరాలకు తరలకుండా పట్టణాలు పల్లెలకు రావాలని కలగనేవారన్నారు. 30 ఏళ్లు మచ్చలేని ప్రజాజీవితం గడిపిన ముత్యంరెడ్డికి టీఆర్‌ఎస్‌ అవమానాన్ని రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 

సిద్దిపేట కలెక్టర్‌ను బదిలీ చేయాలి: జగ్గారెడ్డి
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి... దుబ్బాక అభివృద్ధిలో చెరుకు ముత్యంరెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డిని బదిలీ చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత జీవితాంతం జైల్లో గడపాల్సి ఉంటుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్‌ కుమార్, గూడూరు నారాయణరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా