Bhupesh Baghel: కొరడా దెబ్బల బాధను ఓర్చుకున్న సీఎం, ఎందుకు?

5 Nov, 2021 14:50 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌:  ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్  బఘేల్‎ కొరడా దెబ్బలు తిన్నారు.  దీపావళి ఉత్సవాల్లో భాగంగా గోవర్థన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఇందులో భాగం గానే రాష్ట్ర సీఎం కూడా  కొరడా దెబ్బలు తిని అక్కడి ఆలయ సంప్రదాయాన్ని పాటించారు. ఈ వీడియోను భూపేష్‌ స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఒక వ్యక్తి సీఎం చేతులపై కొరడాతో కొట్టడాన్ని  ఈ వీడియోలో చూడవచ్చు.

శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరైన సీఎం  సంప్రదాయం ప్రకారం 'సొంట' (గడ్డితో చేసిన కొరడా)తో కొరడాతో కొట్టించుకుని ఆ బాధను భరించడం విశేషం. ప్రజల సంక్షేమం కోసం ఇలా చేశానని, తద్వారా  సకల శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు. గోవు ఎంత సుభిక్షంగా ఉంటే ప్రజలు అంత అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గోవర్ధన్ పూజకు ఆదరణ ఉంటుందని సీఎం చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని  రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే సీఎం భూపేష్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ జంజ్‌గిరిలో ఈ సంప్రదాయాన్ని నిర్వహించి, ప్రజలను వారి కోరిక మేరకు కొరడాతో కొట్టేవారనీ, అతని మరణం తరువాత, అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ అతని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు