ప్రభుత్వ స్పందనపై ఆరోగ్యశాఖ మంత్రి అసంతృప్తి.. అసెంబ్లీ నుంచి వాకౌట్‌

28 Jul, 2021 09:02 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తనపై సొంత పార్టీ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ చేసిన ఆరోపణలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదంటూ అసెంబ్లీ నుంచి ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ వాకౌట్‌ చేశారు. తనపై  ఎంఎల్‌ఏ బృహస్పత్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై ప్రభుత్వ స్పందన పరిమితంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసి, సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది.

సొంత ప్రభుత్వ సమాధానంపై ఒక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం ఎక్కడా జరగలేదని ఎద్దేవా చేసింది. ఎంఎల్‌ఏ చేసిన ఆరోపణలపై అసెంబ్లీ కమిటీతో విచారణ జరపాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేస్తూ సభను స్తంభింపజేశారు. దీంతో సభ వాయిదా పడింది. తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని, దీని వెనుక సింగ్‌ దేవ్‌ హస్తం ఉందని ఆదివారం ఎమ్మెల్యే బృహస్పత్‌ ఆరోపించారు. తన ప్రాణాలకు మంత్రి సింగ్‌దేవ్‌ నుంచి ముప్పుందన్నారు. అయితే వీటిని సింగ్‌దేవ్‌ కొట్టిపారేశారు. తనేంటో ప్రజలకు తెలుసన్నారు.

హోంమంత్రి ప్రకటన 
మంగళవారం ఈ అంశంపై హోంమంత్రి తామరధ్వజ్‌ సాహు చేసిన ప్రకటనపై బీజేపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.  కానీ తనకు ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు అందనందున ఎంఎల్‌ఏను కానీ, మంత్రిని కానీ దీనిపై మాట్లాడమని ఆదేశించలేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఈ గందరగోళం నడుమ సింగ్‌దేవ్‌ హఠాత్తుగా లేచి ‘‘జరిగింది చాలు! నేనూ మనిషినే, నా ఇమేజ్‌ గురించి అందరికీ తెలుసు’’ అని అన్నారు. స్పీకర్‌ సూచన మేరకు సీఎం తనను పిలిపించి మాట్లాడారని, ఇంత జరిగినా తిరిగి సభలో ప్రభుత్వ స్పందన చాలా పరిమితంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చేవరకు నేను సభకు హాజరు అవలేను. అప్పటివరకు సభా కార్యకలాపాల్లో పాల్గొనే అర్హత నాకు లేదని భావిస్తున్నాను.’’ అని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.

దీనిపై మీడియాతో మాట్లాడేందుకు ఆయన విముఖత చూపారు. సింగ్‌ చర్యతో సభలో  పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంతో పదినిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ఆరంభమవగానే బీజేపీ సభ్యులు ఈ అంశంపై ఆందోళనను కొనసాగించారు. ఇది సభా మర్యాదకు చెందిన అంశమని, అందువల్ల ఆరోపణలపై హౌస్‌ ప్యానెల్‌ విచారణ జరపాలని మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ పట్టుబట్టారు. ఇదే సమయంలో సింగ్‌దేవ్‌ తిరిగి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. తన సహచరులు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించడంతో తిరిగి వచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పారు. అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి పరిస్థితిపై చర్చించారు. 

మరిన్ని వార్తలు