కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు.. వీడియో వైరల్..

3 Apr, 2023 15:17 IST|Sakshi

రాయ్‌పూర్‌: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో కాంగ్రెస్ ఆదివారం చేపట్టిన టార్చ్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేజీపైకి పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కడంతో బరువు ఆపలేక అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్నవారంతా కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.

అయితే ఈ ఘటనను కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. స్టేజీ కూలిన వెంటనే అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. అందరూ తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ర్యాలీ యథావిధిగా కొనసాగింది.

2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్‌ రాహుల్‌ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయను సంఘీభావం తెలిపాయి.

కాగా.. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సోమవారం సోదరి ప్రియాంక గాంధీతో కోర్టుకు వెళ్లారు. రాహుల్‌కు ఈసారైనా అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి.
చదవండి: జమిలీ ఎన్నికలు తథ్యం..

మరిన్ని వార్తలు