చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. కేంద్రం నిద్రపోతుంది: రాహుల్‌ ఫైర్‌

16 Dec, 2022 18:14 IST|Sakshi

జైపూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చే ముప్పును తక్కువ అంచనా వేస్తుందని విమర్శించారు. డ్రాగన్‌ దేశం యుద్ధానికి కాలు దువ్వుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని అంగీకరించడం లేదని ఆరోపించారు.

భారత్‌ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్‌లోని దౌసాలో రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కూడా ఉన్నారు, కాగా డిసెంబర్‌ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ వాస్తవాధీన రేఖవద్ద భారత్‌, చైనా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్‌ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుపడ్డారు

‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ మన ప్రభుత్వం దానిని గుర్తించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్‌తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిద్రపోతుంది’ అని రాహుల్‌ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చదవండి: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌ రాజధానిలో నీటి సరాఫరా బంద్‌

మరిన్ని వార్తలు