ప్రధాని నా వైపు ఉంటారని ఆశించా.. కానీ: చిరాగ్‌ భావోద్వేగం

25 Jun, 2021 17:15 IST|Sakshi
తండ్రి ఫొటో వద్ద చిరాగ్‌ పాశ్వాన్‌(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా నిలబడతారని ఆశించానని లోక్‌ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. తన రాముడి కోసం ఈ హనుమంతుడు చేయాల్సిందంతా మనస్ఫూర్తిగా చేశాడని, కానీ తాను ఆశించింది జరగలేదని పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్‌కు‌.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బాబాయ్‌ పశుపతి పరాస్‌తో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ను తొలగించడం సహా ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా ఆయనే ఉంటారని రెబల్‌ ఎంపీలు స్పష్టం చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో పాశ్వాన్‌ అసలైన వారుసుడెవరో ప్రజలే తేలుస్తారంటూ జూలై 5 నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు చిరాగ్‌ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతునిచ్చాం. ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌ఆర్‌సీ వంటి అంశాలను స్వాగతించాం. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. అయితే, నేను కష్టకాలంలో ఉన్నపుడు నా ప్రధాని నావైపు ఉంటారని ఆశించాను. కానీ, అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని, ఎవరూ నాకు సహకారం అందించరని త్వరలోనే నాకు బోధపడింది. అంతేకాదు.. నేను వారి మద్దతు ఆశించేందుకు అర్హుడిని కూడా కాదని అర్థమైంది’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

అదే విధంగా.. ‘‘నా సొంత కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి లాంటి మా బాబాయ్‌.. నా కొడుకు వంటి నా సోదరుడు(ప్రిన్స్‌ రాజ్‌) నాకు ద్రోహం చేశారు. మా బాబాయ్‌... మా నాన్నకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆయనను కూడా మోసం చేశారు. బాబాయ్‌.. నాకంటే పెద్దవారు కదా.. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం కనుగొనేవాళ్లం. కానీ ఆయన ఇలా చేయడం సరికాదు. నాకు మాత్రమే కాదు.. నాన్నకు కూడా ఆయన ద్రోహం చేశారు. ఇదంతా చూస్తూ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు’’ అని చిరాగ్‌ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. 

చదవండి: పాశ్వాన్‌ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు
ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!

మరిన్ని వార్తలు