ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్‌ పాశ్వన్‌

15 Oct, 2020 10:42 IST|Sakshi

ఒంటరిగానే పోటీ చేయాలని నాన్న ప్రేరేపించారు

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా వ్యవహరించి రాం‌ విలాస్‌ పాశ్వాన్‌ మృతి కూటమికి తీరని లోటనే చెప్పవచ్చు. అయితే నితీష్‌ కుమార్‌తో విబేధాల నేపథ్యంలో ఈ సారి రాం‌ విలాస్‌ పాశ్వాన్‌ ఒంటరిగా బరిలో దిగాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇది తన తండ్రి కోరిక అన్నారు. ఈ సందర్భంగా చిరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో​ ఒంటరిగా పోటీ చేయాలని మా నాన్న భావించారు. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోయినా.. బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై పోరాడతాం. ఒంటరిగా బరిలో దిగాలని నాన్న నన్ను ప్రేరేపించారు. ఇది నాన్న గారి అతిపెద్ద కల. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని గరించి విదేశాంగ శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్, షహనావాజ్ హుస్సేన్ వంటి చాలా మంది బీజేపీ నాయకులకు తెలుసు’ అన్నారు. (పాశ్వాన్‌ మృతి: కుమారుడికి కష్టాలు..!)

అంతేకాక ‘ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరో ఐదేళ్లు కొనసాగితే మీరు మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నాన్న భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారు’ అన్నారు చిరాగ్‌ పాశ్వాన్‌. తన తండ్రి మరణం తనను ఎంతో కుంగదీసిందన్నారు‌. ‘నేను తనని చాలా మిస్‌ అవుతున్నాను. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరు ముందుగా ఊహించలేరు. ఈ బాధ వర్ణణాతీతం. నాన్న లేరు.. మరో వైపు ఎన్నికలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలే నాకు బలం. ఆయన పాటించిన విలువలను నేను కొనసాగిస్తాను’ అని చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదన్నారు సుశీల్‌ కుమార్‌ మోదీ. 

మరిన్ని వార్తలు