చిరాగ్‌ పాశ్వాన్‌ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లంతా టచ్‌లోనే

9 Jul, 2021 10:59 IST|Sakshi

న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్‌జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్‌ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.

తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్‌ పశుపతి పరాస్‌తో చేతులు కలిపిన నితీశ్‌ కుమార్‌.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్‌ జోస్యం చెప్పారు. నితీశ్‌ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. 

పాశ్వాన్‌ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి
దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్‌ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్‌ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్‌ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్‌ పాశ్వాన్‌... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చిరాగ్‌తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ (63)కు సైతం బిహార్‌ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు