నేను సింహం బిడ్డను.. పదవి కోరితే ఇచ్చేవాడిని: చిరాగ్‌ భావోద్వేగం

16 Jun, 2021 16:49 IST|Sakshi
తండ్రితో చిరాగ్‌ పాశ్వాన్‌(ఫైల్‌ ఫొటో)

పార్టీని, కుటుంబాన్ని కలిపి ఉంచేందుకు ప్రయత్నించా

కానీ నన్ను ఘోరంగా మోసం చేశారు

పదవి కోరితే నేను ఇచ్చేవాడిని

సింహం బిడ్డను పోరాటానికి సిద్ధం

పట్నా/న్యూఢిల్లీ: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. ఈ అంశంపై చట్టబద్ధ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడైన చిరాగ్‌ పాశ్వాన్‌, బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరాస్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్‌ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకోవడం.. ఈ విషయాన్ని స్పీకర్‌ ఓం బిర్లాకు తెలపడం.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఈ క్రమంలో చిరాగ్‌ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఎల్జేపీ ప్రకటన విడుదల చేయగా.. ఇందుకు స్పందించిన చిరాగ్‌.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌... ‘‘ఒకవేళ పశుపతి పరాస్‌ పార్లమెంటరీ నేతగా ఉంటానని నన్ను కోరితే ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నిజానికి దీనంతటి వెనుక జేడీయూ హస్తం ఉంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణం. ఏదేమైనా నేను రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడిని. సింహం బిడ్డను. కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తాను’’అని చెప్పుకొచ్చారు.

అదే విధంగా.. ‘‘నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాబాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారు’’ అని చిరాగ్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు-2020లో తమ పార్టీ పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయం నాకు అత్యంత కఠినమైనది.. అప్పుడే నాన్నను కోల్పోయాను. నా కుటుంబంతో సరిగ్గా సమయం గడిపే వీలు కూడా దొరకలేదు. శాసనసభ ఎన్నికల్లో ఎల్జేపీ బాగానే పనిచేసింది. మా పార్టీకి ఓటింగ్‌ శాతం 2 నుంచి 6 శాతానికి పెరిగింది’’ అని తన నాయకత్వాన్ని చిరాగ్‌ సమర్థించుకున్నారు. 

చదవండి: ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్‌ చచ్చిపోయాడు’

మరిన్ని వార్తలు