‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్‌ చచ్చిపోయాడు’

15 Jun, 2021 17:46 IST|Sakshi

తండ్రి మరణం తర్వాత బాబాయ్‌తో విభేదాలు

సలహాలు, సూచనలు లెక్కచేయని వైనం!

అందుకే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందా?

చిరాగ్‌ పాశ్వాన్‌ తదుపరి వ్యూహం ఏమిటి?

వెబ్‌డెస్క్‌: మనం ఇతరులకు ఏం ఇస్తామో అదే తిరిగి వస్తుంది.. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు.. అవమానానికి అవమానం.. ప్రతీకారానికి ప్రతీకారం.. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బాబాయ్‌ పశుపతి పరాస్‌తో తన వ్యవహార శైలి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందు వెళ్లి చేజేతులా తానే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునే విధంగా ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణించిన తర్వాత చిరాగ్ పూర్తిస్థాయిలో ‘లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. 

అయితే, అప్పటివరకు తండ్రి నీడలో ఉన్న చిరాగ్‌ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో తమతో పాటు ఎన్డీయేలో భాగస్వామి అయిన సీఎం నితీశ్‌ కుమార్‌తో విభేదించారు. కూటమి సమీకరణాలు పట్టించుకోకుండా సొంతంగా ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూనే అధికార జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎల్జేపీ ఘోరంగా విఫలమైనప్పటికీ, జేడీయూ ఓట్లను మాత్రం చీల్చగలిగింది. దాదాపు 35 స్థానాల్లో సీట్లకు గండికొట్టింది. 

ఈ నేపథ్యంలో సోమవారం నాటి పరిణామాల వెనుక కచ్చితంగా జేడీయూ చీఫ్‌, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమను దెబ్బకొట్టిన చిరాగ్‌కు తమ సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే పశుపతి పరాస్‌తో తిరుగుబాటు చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పశుపతి మాత్రం ఈ వార్తలను కొట్టిపడేశారు. ఎల్జేపీని పరిరక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనతో సహా ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందని కుండబద్దలుకొట్టారు.

నువ్వు నా రక్తం కావు..
ఈ నేపథ్యంలో... చిరాగ్‌కు, పశుపతికి మధ్య చెలరేగిన విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఎల్జేపీలో చీలిక వచ్చిందన్న విషయం సుస్పష్టమవుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి మృతి తర్వాత చిరాగ్‌, బాబాయ్‌ పశుపతిని తీవ్రంగా అవమానించారని పేర్కొంటున్నారు. ఒకానొక సమయంలో.. తన తల్లి రీనా పాశ్వాన్‌, కజిన్‌ ప్రిన్స్‌ రాజ్‌, అతడి అనుచరుడు సౌరభ్‌ పాండే ముందే.. ‘‘నువ్వు నా రక్తం కానేకాదు’’ అంటూ వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. చిరాగ్‌ మాటలతో మనోవేదనకు గురైన పరాస్‌.. ‘‘ఈరోజు నుంచి మీ బాబాయ్ నీకు లేడు. చచ్చిపోయాడు’’ అంటూ అదే స్థాయిలో అతడికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. 

దీంతో రంగంలోకి దిగిన చిరాగ్‌ తల్లి రీనా పాశ్వాన్‌, పరాస్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, అయితే, ‘‘అన్నదమ్ముల అనుబంధం గురించి మీకు బాగా తెలుసు. కానీ దీపు(చిరాగ్‌ను ఉద్దేశించి) నన్ను పార్టీ నుంచి వెళ్లగొడతానని బెదిరించినపుడు మీరు తనను చెంపదెబ్బకొట్టలేదు. కనీసం తన మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పలేదు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను చిరాగ్‌ తెగేదాకా లాగడంతోనే పరాస్‌ తిరుగుబాటుకు ఉపక్రమించారని ఆ కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘చిరాగ్‌ ఎప్పుడూ తన తండ్రి, బాబాయ్‌ల మధ్య అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారికి ఎటువంటి కష్టం రాకుండా కనిపెట్టుకుని ఉన్న తీరును గమనించలేదు. బహుశా అందుకేనేమో ప్రతీసారి దూకుడుగా ప్రవర్తించి పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నాడు’’ అని వారు వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. 

గంటన్నర సేపు వెయిట్‌ చేయించారు
రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన పశుపతి పరాస్‌... తెరవెనుక ఉంటూనే ఆయన రాజకీయ జీవితంలో తన వంతు పాత్ర పోషించారు. మరో సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌కు సైతం అన్ని విధాలా అండగా నిలబడ్డారు. అయితే, రామ్‌విలాస్‌ మరణం తర్వాత చిరాగ్‌ మాత్రం ఆయనను ఖాతరు చేయలేదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరాస్‌ సలహాలు, సూచనలు పట్టించుకోకపోవడం, కించపరిచే విధంగా వ్యవహరించడం సహా... ఒంటెద్దు పోకడలతో పార్టీని మొత్తంగా ముంచివేసే విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

అందుకే చిరాగ్‌ సోమవారం స్వయంగా ఢిల్లీలోని పరాస్‌ నివాసానికి వెళ్లి, గంటన్నర సేపు ఎదురుచూసినా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంపీలు పరస్, ప్రిన్స్‌ రాజ్, చందన్‌ సింగ్, వీణాదేవి, మెహబూబ్‌ అలీ కైజర్‌ల తిరుగుబాటు నేపథ్యంలో మంగళవారం ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ పాశ్వాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా తానే తిరుగుబాటు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చిరాగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో తదుపరి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారన్న అంశం చర్చనీయాంశమైంది.

చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్‌ చాణక్యం!

మరిన్ని వార్తలు