ఇద్దరు ప్రధాన నేతల మధ్య విభేదాలు 

4 Sep, 2020 09:09 IST|Sakshi

కాంగ్రెస్‌కు జిల్లాలో పెద్ద తలకాయగా ఉన్నారు ఒకరు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో సభ్యుడు మరొకరు. జిల్లాలో పార్టీని నడిపించాల్సింది వీరే. వరుస పరాజయాలతో డీలా పడిన దశలో శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన  బాధ్యత వీరిపైనే ఉంది. కానీ.. వారు అవన్నీ మరిచి ఆధిపత్య పోరుకు తెరలేపారు. ఫలితంగా జిల్లాలో పరిస్థితి ‘చేయి’ దాటగా.. ‘హస్తం’ శ్రేణుల్లో అసహనంతోపాటు ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి, మెదక్‌ : జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారింది. ఆధిపత్యపోరుతో ఇద్దరు ప్రధాన నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇందుకు చేగుంట మండలంలోని వడియారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పార్టీని గాడిన పెట్టాల్సిన పెద్దలే సంయమనం కోల్పోయి పరస్పర దూషణలు, బాహాబాహీకి దిగడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ‘హస్తం’ శ్రేణులను కలవరపరుస్తున్నాయి.  

‘పుర’పోరు సమయంలోనే బీజం 
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటి నుంచో వర్గపోరు నడుస్తోంది. ముఖ్య నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిన తర్వాత ప్రధానంగా రెండు గ్రూపులు మిగిలాయి. అయితే ఈ ఏడాది జనవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ సమయంలో టౌన్, నాన్‌ టౌన్‌ రాజకీయం తెరపైకి రాగా.. పార్టీలో ఉన్న ఇద్దరు ప్రధాన నేతల మధ్య అగ్గిరాజుకుంది. పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో రెండు వర్గాల నాయకులు, అనుచరులు పరస్పర దూషణలకు దిగినట్లు తెలిసింది. అప్పటి నుంచి చిలికి చిలికి గాలివానగా మారి ఒకరికొకరు చేయి చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. 

ఎవరికి వారే.. 
చేగుంట మండలం వడియారంలో గత నెల 19న  జరిగిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ నాయకుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డితోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రధాన నేతలు వచ్చారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వైరి వర్గ నేతల మధ్య మాటామాట పెరిగి చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ విషయం పార్టీ హైకమాండ్‌ వరకు వెళ్లగా.. పక్క జిల్లా నేతలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. దీని తర్వాత ఈ ఇద్దరు ప్రధాన నేతలు ఎక్కడ కూడా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పార్టీ రాష్ట్ర, జాతీయ నేతల వర్ధంతి, జయంతితోపాటు ఇతర కార్యక్రమాలను ఎవరికి వారే తమతమ వర్గాల అనుచరులతో కలిసి నిర్వహించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.  

డీసీసీ పీఠం కోసమేనా? 
కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. ఈ క్రమంలో డీసీసీ పీఠం కోసమే ఉనికి చాటుకునేందుకు మెదక్‌ పట్టణానికి చెందిన నేత ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆయన వర్గీయులు టౌన్, నాన్‌ టౌన్‌ అంశంతోపాటు వైరివర్గ నేతకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ‘హస్తం’.. ఆ తర్వాత క్రమంలో దయనీయ స్థితి చేరడాన్ని కాంగ్రెస్‌ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు