బీసీ బంధు పథకం ఎక్కడ?

20 Apr, 2023 03:18 IST|Sakshi

అసెంబ్లీలో ఇచ్చిన హామీ ఏమైంది? 

54 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 5 శాతం నిధుల కేటాయింపులా..? 

జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి 

సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ 

సాక్షి, పెద్దపల్లి: దళితబంధు మాదిరిగానే బీసీలకు బీసీ బంధు పథకం ప్రారంభించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. బీసీబంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ ఎందుకు కార్యరూపం దాల్చడం లేదని ప్రశ్నించారు. హాథ్‌ సే హాథ్‌ జోడోయాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలో కొనసాగింది.

ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్న బీసీల జీవితాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెలగాటం ఆడటం మానుకోవాలని, వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు చేసి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2.90లక్షల కోట్లుకాగా.. ఇందులో బీసీ సంక్షేమానికి కేవలం 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని తెలిపారు.

చివరికి కేటాయించిన ఆ కొద్ది శాతం నిధులనూ పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదని విమర్శించారు. 2018–19లో కూడా బీసీల సంక్షేమానికి రూ.5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. సబ్సిడీ రుణాల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. సీఎం కళ్లు తెరిచి బీసీలు, ఎంబీసీలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.  

బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ..? 
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తెస్తామని 2017లో అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పటివరకు ఎందుకు చేయలేదని భట్టి ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తే మరో రూ.10 వేల కోట్లు అదనంగా సమాకూరేవన్నారు. 2017లో ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా అలంకారప్రాయంగానే మిగిలిందన్నారు. ప్రతి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చూపుతున్నా.. ఫైనాన్స్‌ విభాగం ఆమోదం పొందింది నామమాత్రమేనని, అందులో ఖర్చు చేసింది చాలా తక్కువని ఆరోపించారు.

2018–19లో 75 శాతం, 20–22లో 100 శాతం నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీలను మోసగించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన జీవోలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, ఎంబీసీ జాబితాలో చేర్చాలని 15 కులాలవారు ప్రభుత్వానికి విన్నవించుకుని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారని, మంత్రివర్గంలో కేవలం ముగ్గురికి పదవులిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు