టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్నినవ్వుల పాలు చేస్తున్నాయి: భట్టి

31 Oct, 2022 01:19 IST|Sakshi

మర్రిగూడ: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రజాస్వామ్యా న్ని నవ్వుల పాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపదను టీఆర్‌ఎస్, బీజేపీలు సాధ్యమైనంతవరకు దోపిడీ చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని గద్దల్లా చీల్చుకుతింటున్నారని మండిపడ్డారు.

సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని ప్రలోభాలకు గురిచేసి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల నాయకులను కొనడం టీఆర్‌ఎస్, బీజేపీలకు కొత్తేమీకాదని చెప్పారు. మునుగోడులో బీజేపీ లేదా టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజలకు బతుకుదెరువు కరువవుతుందన్నారు. రెండు దశాబ్దాల కాలం పాటు సేవే లక్ష్యంగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడటం నియోజకవర్గ అభివృద్ధికి శుభసూచకమన్నారు.

అనంతరం శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు, పింఛన్లు బంద్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై హైకోర్టు, సీబీఐతో విచారణ చేయించకుండా నిలిపివేయాలని ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు