కేసీఆర్‌ పాపాలు కప్పిపుచ్చుకునేందుకే ఆ అమ్మకాలు

11 Jun, 2021 17:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ తన విశృంఖ‌ల ఆర్థిక పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వేల‌కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌భుత్వం భూముల‌ను అమ్మ‌కానికి పెట్టారని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. జిల్లాకు వెయ్యి ఎక‌రాల చొప్పున దాదాపు 33 వేల ఎక‌రాల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను తెగ‌న‌మ్మ‌డానికి సిద్ద‌మ‌య్యారని అన్నారు. అవి ప్రభుత్వ భూములు.. ప్రజల భూములు.. వాటిని ప్రజా అవసరాల కోసమో ఉపయోగించాలని, ప్ర‌జావసరాలకోసం ఉపయోగపడే వాటిని క‌ర‌గ‌దీయ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు.

 ‘‘ స్వాతంత్రం వ‌చ్చినప్ప‌టినుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ.. ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకుంటూ విలువైన ఆస్తుల‌ను ప్ర‌జ‌ల కోసం సృష్టించాయి. అంతేకాక ప్ర‌జా అవ‌స‌రాల కోస‌మే ప్ర‌భుత్వ భూముల‌ను వినియోగించాయి. తెలంగాణ భవిష్య‌త్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగప‌డే 33 వేల ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.  నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 15వేల కోట్ల మిగుల బ‌డ్జెట్ తో ఏర్పాటు చేసింది. ఆ మిగులు బ‌డ్జెట్ సొమ్ము, అప్పులు తెచ్చిన రూ.4 ల‌క్ష‌ల కోట్ల డ‌బ్బు, మొత్తంగా కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌ పేరుతో కాజేసి.. ఇప్పుడు భూముల‌మీద కేసీఆర్ ప‌డ్డారు. ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకోలేక వాటిని అమ్ముతున్నామ‌ని.. అవి నిర‌ర్ధ‌క ఆస్తుల‌ని సిగ్గులేకుండా కేసీఆర్ మాట్లాడ‌తున్నారు. ఇంత పెద్ద ప్ర‌భుత్వం ఉండి.. భూముల‌ను కాపాడుకోలేమ‌ని చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. భూముల‌ను కాపాడ‌లేని వ్య‌క్తుల‌ను తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడతారని నేను ప్ర‌శ్నిస్తున్నాను. 

అప్పుచేసిపప్పుకూడులా కేసీఆర్ పాలన చేస్తున్నాడు. ఆస్తులు అమ్మి, భూములు అమ్మి.. అప్పులు తెచ్చి.. చివరకు టోటల్ గా తెలంగాణను కూడా కేసీఆర్ అమ్మేస్తాడు. ప్రభుత్వపరంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కు, ఆసుపత్రులకు, వివిధ ప్రజావసరాలకు భూములు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. అరకొరగా ఉన్న భూములను పేలాలపిండి నాకేసినట్లు నాకేస్తే రాష్ట్రం ఏమవ్వాలి.. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.. జాగృతం కండి.. మన రాష్ట్రాన్ని, మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు అప్పులను, ఆస్తులు లేని తెలంగాణను ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితికి కేసీఆర్ పథక రచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రం మనది... దీనిని మనమే కాపాడుకోవాలి. ఈ అమ్మకాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు