ఎమ్మెల్యేల రేట్లు పెరిగాయి

31 Jul, 2020 04:21 IST|Sakshi

వారికి అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌ ఇస్తున్నారు

రాజస్తాన్‌ సీఎం గహ్లోత్‌ వ్యాఖ్య

జైపూర్‌: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జోరందుకుందని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ గురువారం వ్యాఖ్యానించారు. ‘ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా రూ. 10 కోట్లు, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన తరువాత.. ఎంత కావాలో చెప్పండి అంటూ అపరిమిత ఆఫర్‌తో ముందుకు వస్తున్నారు’ అని ఆరోపించారు.

ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని బీజేపీపై పరోక్ష ఆరోపణలు చేశారు.  కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీఎస్పీ చీఫ్‌ మాయావతి బీజేపీ తరఫున మాట్లాడుతున్నారని గెహ్లోత్‌ విమర్శించారు. 200 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తంగా 107 మంది సభ్యులుండగా, వారిలో సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో 19 మంది నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేయడంతో, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తన వర్గం ఎమ్మెల్యేలను పైలట్‌ గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉంచారు.

మరోవైపు, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్‌ శివార్లలోని ఫెయిర్‌మాంట్‌ హోటల్‌కి సీఎం గహ్లోత్‌ తరలించారు.  ఆగస్ట్‌ 14 వరకు కూడా వారంతా ఒకే దగ్గర ఉంటారని కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి అన్నారు. ఫెయిర్‌మాంట్‌ హోటల్‌లోనే సీఎల్పీ భేటీని నిర్వహించారు.  కాగా, తమ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టు స్పందించింది. ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు