Karnataka: 2-3 జాబితాలు.. కేబినెట్‌ ఖరారు నేడే! 

3 Aug, 2021 08:08 IST|Sakshi
సీఎం బసవరాజ్‌ బొమ్మై(ఫైల్‌ ఫొటో)

ఢిల్లీలో సీఎం బొమ్మై చర్చలు   

సాక్షి బెంగళూరు: నూతన మంత్రుల జాబితాను మంగళవారం సాయంత్రం బీజేపీ హైకమాండ్‌ విడుదల చేసే అవకాశముంది. సోమవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అధినేత జేపీ నడ్డాతో సీఎం బసవరాజు బొమ్మై సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా చర్చించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటిల్‌ కూడా పాల్గొన్నారు. అనంతరం వివరాలను సీఎం మీడియాకు తెలిపారు. మంత్రివర్గ ఏర్పాటుపై చర్చించామని, హైకమాండ్‌ మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాను 2– 3 జాబితాలు ఇచ్చానని, మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా ఎవరెవరు ఉండాలనేది హైకమాండ్‌ మంగళవారం సాయంత్రం తేల్చనుందని చెప్పారు. నేడు మరో దఫా చర్చలు జరుపుతామని, అధిష్టానం నుంచి అనుమతి రాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ముహూర్తం వెల్లడిస్తానని సీఎం తెలిపారు. పార్టీలో ఎవరూ ఫిరాయింపుదారులు, వలసదారులు లేరని, అందరూ బీజేపీ నేతలేనని చెప్పారు.

సీఎం ఢిల్లీ యాత్రలేల: సిద్ధు
శివాజీనగర: కరోనా థర్డ్‌ వేవ్‌పై రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం కావాలని  సీఎల్పీ నేత సిద్ధరామయ్య కోరారు. సోమవారం కారవారలో మాట్లాడుతూ  సీఎం బొమ్మై మంత్రిమండలి ఏర్పాటుకు ఢిల్లీకి పదే పదే వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఒకసారి వెళ్లి రావాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరులో మకాం వేసి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి వెళ్లి పని చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రోజువారి కరోనా సోకితుల సంఖ్య 2 వేలు దాటితే మూడో దశ మొదలైనట్లు అర్థమన్నారు.     

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు