కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: పంజాబ్‌ సీఎం చన్నీ

22 Jan, 2022 21:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్‌ సీఎం చరణ్‌ జిత్‌ చన్నీ అన్నారు. పరువు నష్టం దావా వేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతి కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించిన నేపథ్యంలో పంజాబ్‌ సీఎం చన్నీని ఉద్దేశించి కేజ్రీవాల్‌ ‘నిజాయితీ లేని వ్యక్తి’ అంటూ విమర్శించారు.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై స్పందించిన చన్నీ.. తర్వలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్టలకు భంగంకలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గతంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి.. తర్వాత క్షమాపణలు చెప్పిన ఘటనలు కూడా చూశామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలపై ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేసి.. తర్వాత క్షమాపణలు చేప్పి అక్కడి నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. అయితే ఈ సారిగా ఊరుకునే ప్రసక్తే లేదని.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు.

భూపిందర్ సింగ్ హనీ నివాసంలో జరిగిన దాడుల్లో రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.  పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.

మరిన్ని వార్తలు