అందుకే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు!

24 Jul, 2020 13:37 IST|Sakshi

రాజస్తాన్‌: కేంద్రంపై సీఎం గెహ్లోత్‌ ఆరోపణలు

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చిన విధంగానే రాజస్తాన్‌లో కూడా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని.. ఎవరి బలమెంతో అక్కడే తేలుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారని.. మెజారిటీ నిరూపించుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. (రాజస్తాన్‌ సంక్షోభం : పైలట్‌ వర్గానికి ఊరట)

అదే విధంగా కొంతమంది అసంతృప్త నేతలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని గెహ్లోత్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగానే గవర్నర్‌ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్న ఆయన.. రాజ్‌భవన్‌ను ప్రజలు ముట్టడిస్తే తాము బాధ్యత వహించబోమన్నారు. కాగా సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఆరోపణలను ఖండించిన గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం సబబు కాదని పేర్కొన్నారు.

ఇక గెహ్లోత్‌ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్‌ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందున శాసనసభ స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని పేర్కొంటూ.. యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సచిన్‌ పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన వెంటనే సీఎం గెహ్లోత్‌ గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు