చంద్రబాబు వల్లే ఖజానా దివాలా..

8 Apr, 2022 09:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఖజానా దివాలా తీయడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దిగజార్చడమే బాబు పని అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారని, అలాచేస్తే టీడీపీ బండారమే బయటపడుతుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం జగన్‌ ఎంతదూరమైనా వెళతారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మకపాత్ర పోషించాలేగానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు.

గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, విభజన హామీలతోపాటు పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉభయ సభల్లోను పార్టీ ఎంపీలు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నాం. ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం, కడప ఉక్కుపరిశ్రమ, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇలా అన్ని అంశాలు చర్చిస్తే.. దానిపైనా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. బాబు లాంటి ప్రతిపక్ష నేత దొరకడం ప్రజల దౌర్భాగ్యం. వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేనాటికే రాష్ట్ర ఖజానా దివాలా తీసిన విషయం ప్రజలకు తెలిసిందే. బాబు స్వప్రయోజనాల కోసం పాలనను అస్తవ్యస్తం చేస్తే కరోనా సమయంలోను జగన్‌ సంక్షేమ పథకాలు అందించారు.

బాబు చేసిన అప్పుల్ని జగన్‌ తీరుస్తున్నారు..
చంద్రబాబు ఖజానాను ఖాళీచేసి వెళ్తే.. ఆ అప్పులను ప్రభుత్వం తీరుస్తోంది. ఏపీలో ఏవో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. బాబు వెళ్తూవెళ్తూ రూ.100 కోట్లు ఉంచి మిగతా ఖజానా అంతా ఊడ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామనడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, భోగాపురం పనులు ముందుకు తీసుకెళ్లడం, దక్షిణ కోస్తా జోన్‌ తీసుకురావడం.. ఇవన్నీ టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడికి ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహంలా కనిపిస్తున్నాయి. శ్రీలంక తరహాలో ఏపీ ఆర్థికంగా కుప్పకూలిపోతోందని టీడీపీ, పవన్‌కల్యాణ్‌ బోగస్‌ ప్రచారాలు చేస్తున్నారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి’ అని వారు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు