CM KCR: ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో

20 Aug, 2022 17:06 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజా దీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్‌లో మమత సర్కార్‌ను పడగొడతానని ప్రధాని అంటున్నారని.. నిన్ను(మోదీ) నీ అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందన్నారు.

‘ఈడీకి దొంగలు భయపడతారు.. నేను ఎందుకు భయపడతా.. ఈడీ వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయ్‌ తాగించి పోతారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకకపోయినా.. నేను గోకుతా. ఢిల్లీలో కరెంట్‌ లేదు, హైదరాబాద్‌లో ఉంటోంది. మీరు ఉద్ధరించింది ఏమిటి. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ.. బ్యాంకులు ముంచే వాళ్లకు పంచుతున్నారు.
చదవండి: ‘ఏడాదిలో ఎన్నికలు.. ఎవరి కోసం రాజీనామా చేసినవ్‌ రాజగోపాల్‌ రెడ్డి’: సీఎం కేసీఆర్‌

మీకు చేత కాదు.. మేము చేస్తుంటే అడ్డుపడతారా. గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎక్కడికి పోయింది చూసి ఓటేయండి. మాటలు విని మోసపోతే.. గోసపడతాం. అందరం కలిసి బీజేపీకి మీటర్‌ పెడదాం. దయచేసి ప్రలోభాలకు పోవద్దు.. ఇది పార్టీల ఎన్నిక కాదు. చండూరులో మరోసభ పెట్టుకుందాం. కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. మీటర్లు పెట్టనివ్వను. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది వేస్ట్‌ అయిపోతుంది. పాటుపడే వారికి ఓటు వేయాలి తప్ప పోటువేసేవాడికి కాదు’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాగా, మునుగోడు సభలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్‌ అభ్యర్థి ప్రస్తావనే తీసుకురాకుండా సభను ముగించారు.

>
మరిన్ని వార్తలు