ఈ నెల 20న రాష్ట్ర వాస్తంగా నిరసనలు: సీఎం కేసీఆర్‌

17 Dec, 2021 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కేంద్ర వైఖరిని నిలదీస్తూ బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.  మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోని తేల్చుకొని రావాలని పేర్కొన్నారు. తాను కూడా 19వ తేదిన పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజపీతో చావో రేవో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నేతలు జనంలో ఉండకుంటే ఎవరూ ఏం చేయాలని అన్నారు. నాయకులంతా చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలని తెలిపారు.
చదవండి: రైతు బంధుపై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని, ఈ విషయాన్ని రైతులకు వివరించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేసేలారైతులను ప్రోత్సాహించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రిని క‌ల‌వ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు. అలాగే త్వరలోనే టీఆర్‌ఎస్‌ కొత్త రాష్ట్ర కమిటీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడా.. లేదా కన్వీనర్‌ను నియమించాలా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు