Huzurabad Bypoll: హుజూరాబాద్‌ ఓటర్లకు సీఎం లేఖలు 

13 Aug, 2021 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌... ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారిని పార్టీ తరఫున వ్యక్తిగతంగా కలసి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు కోరాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారి జాబితాను మున్సిపాలిటీలు, వార్డులు, మండలాలు, గ్రామాలవారీగా సిద్ధం చేశారు.

ఈ జాబితాల ఆధారంగా లబ్ధిదారులను పార్టీ యంత్రాంగం ద్వారా నేరుగా చేరుకొని పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో సుమారు 70 వేల మంది వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్లు టీఆర్‌ఎస్‌ గుర్తించింది. లబ్ధిదారులకు స్వయంగా ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు నియోజకవర్గంలోనూ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖతో కూడిన రెండు లక్షల కరపత్రాలను గులాబీ రంగులో ముద్రించింది. ‘దళితబంధు’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌కు వస్తుండటంతో ఆలోగా లేఖల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఉప ఎన్నిక ఇన్‌చార్జీలకు ఆదేశాలు అందాయి. 

ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి.:
హుజూరాబాద్‌లో మకాం వేసిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు, రేషన్‌ కార్డుల జారీ, సీసీ రోడ్లు, మహిళలు, కుల సంఘాలకు భవనాలు, స్త్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో తలమునకలై పనిచేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో పద్మశాలి స్థలానికి రూ.కోటి నిధులతోపాటు ఎకరా స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.   

మరిన్ని వార్తలు