అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్‌

13 Aug, 2022 15:02 IST|Sakshi

హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు శరవేగంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలవడం, కాంగ్రెస్, బీజేపీలు ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో దిద్దుబాటు చర్యల కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరోవైపు ఈ నెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సభ జరిగే నాటికి పార్టీలోని అసంతృప్తిని తొలగించేందుకు కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం చౌటుప్పల్‌ మండలం ఆందోలు మైసమ్మగుడిలో జరిగిన టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల భేటీ వెనుక ఆ నియోజకవర్గ నేత కంచర్ల కృష్ణారెడ్డి హస్తం ఉందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన శనివారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 

అభ్యర్థి ఎవరైనా గెలిపించండి! 
మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుని రావాల్సిందేనని కేసీఆర్‌ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న కృష్ణారెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్‌రెడ్డి తీరుపై పార్టీ ముఖ్యనేతల్లో నెలకొన్న అభిప్రాయాలను, వారిని ఇబ్బంది పెట్టిన తీరును కృష్ణారెడ్డి కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. కాగా, కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్‌ ఖాయమనే ప్రచారానికి తెరవేస్తూ టికెట్‌ ఇవ్వడం సాధ్యంకాదనే విషయాన్ని సీఎం సున్నితంగా తెలియచేసినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీపరంగా గుర్తింపు ఉంటుందని హామీనిచ్చినట్లు తెలిసింది. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ గౌరవిస్తుందని, అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే కోణంలో పలు సర్వేలు జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

మండలాలవారీగా పార్టీ ఇన్‌చార్జీల భేటీలు 
ఈ నెల 20న మునుగోడులో టీఆర్‌ఎస్‌ బహిరంగసభ నేపథ్యంలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మండలాలు, మున్సిపాలిటీలవారీగా శనివారం టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో భేటీలకు శ్రీకారం చుట్టారు. ఉపఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంతోపాటు అభ్యర్థిపై వారి మనోగతం తెలుసుకోవడం, బహిరంగసభకు జనసమీకరణ తదితరాలు ఎజెండాగా ఈ భేటీలు జరుగుతున్నాయి.  

మరిన్ని వార్తలు