CM KCR: ఆ పథకం కేంద్రానిదే అయితే.. ఒక్క నిముషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్‌

8 Nov, 2021 20:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వడ్లు కొంటుందా లేదా అని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. కొంటే కొంటామని చెప్పండి లేదంటే లేదని చెప్పండి. గోల్‌మాల్‌ ముచ్చట్లు వద్దని బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు. వరి వేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ విషయం పరిజ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. బీజేపీ రెండు స్టాంపులను తయారు చేసి పెట్టుకుందని, ఒకటి దోశద్రోహి, రెండు అర్బన్‌ నక్సలైట్‌ అని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ‘దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి’

ప్రజల పక్షాన నిలిచి కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే  దోశద్రోహులంటున్నారని మండిపడ్డారు. మేఘాలయ గవర్నర్‌, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.. వారు కూడా  దేశద్రోహులా? అని ప్రశ్నించారు. ప్రెస్‌ మీట్‌ పెట్టి బం‍డి సంజయ్‌ వడ్ల గురించి తప్ప సొల్లు పురాణం వాగాడని మండిపడ్డారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా? లేదా చెప్పాలని కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. సమాధానం చెప్పే శక్తి లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ రైడ్స్‌ చేయిస్తారు: సీఎం కేసీఆర్‌
‘తెలంగాణలో పునాది లేని పార్టీ బీజేపీ. రైతులు సమ్మె చేస్తున్నా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్‌ అని బండి సంజయ్‌ అంటున్నడు. అప్పుడు నీకు కనీసం పార్లమెంట్‌ ఉందని తెలుసా. ఇంధన ధరలపై ప్రశ్నిస్తే అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌కు వెళ్లిపోండి అంటున్నరు. ఇదేనా మాట్లాడే పద్ధతి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 107 సీట్లలో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఎవరిపై తెలంగాణ ప్రజల విశ్వాసం ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది కదా.

62 లక్షల హెక్టార్లలో వరి పంట ఎక్కడుంది అంటున్నరు. 6 హెలిక్యాప్టర్లు పెట్టి చూపిస్తా. మీ నాయకులను వెంటేసుకుని రా. రాయలసీమ కరువు ప్రాంతం. వారికి నీళ్లు రావాలని చెప్పా. బేసిన్లు, భేషాజాలు వద్దని చెప్పా. పక్క రాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా. గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని నిరూపిస్తే నేను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా. గొర్ల పథకానికి మేం ఎన్‌సీడీసీ నుంచి అప్పు తెచ్చుకున్నాం. గొర్ల పథకం బీజేపీది అయితే కర్ణాటకలో ఎందుకు లేదు.’ అని సీఎం కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

కాగా, బండి సంజయ్‌, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఇంకోసారి అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపుతమని అనడంపై మండిపడుతూ.. దమ్ముంటే టచ్‌ చేసి చూడాలని  సీఎం కేసీఆర్‌ సవాల్‌ చేశారు.కేసీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ సోమవారం ధీటుగా బదులిచ్చారు. గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నది కేసీఆర్‌యేనని, ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఆడతారని విమర్శించారు. ఈనేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌గా సీఎం కేసీఆర్‌ వరుసగా రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు