CM KCR Tour: అడుగడుగునా పలకరింపులు.. ఆలింగనాలు

28 Aug, 2021 07:29 IST|Sakshi
కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ కర్ణన్‌

సాక్షి, కరీంనగర్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌ పర్యటన మొత్తం బిజీబిజీగా గడిచింది. గురువారం రాత్రి కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలోని తన సొంత నివాసాని(ఉత్తర తెలంగాణభవన్‌)కి చేరుకున్న ఆయనకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్‌ కర్ణన్, ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణ, మేయర్‌ సునీల్‌రావులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గతంలో కేసీఆర్‌ ఎప్పుడు కరీంనగర్‌ వచ్చినా.. రాత్రిపూట సమావేశాలు నిర్వహించలేదు. తొలిసారిగా జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముచ్చటించారు. వారితో భేటీ అనంతరం కేసీఆర్‌ ఇక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ భవన్‌ వద్ద హడావుడి మొదలైంది.

కరీంనగర్‌లోని కేసీఆర్‌ బాల్యమిత్రులు, 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తోన్న నాయకులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి పోటెత్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్‌ ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ ఆలింగనాలు చేసుకున్నారు. 2001 పార్టీ స్థాపించినపుడు, 2006, 2008 ఉపఎన్నికలు, 2009 ఉద్యమసమయం నాటిరోజులను ఆయన నెమరువేసుకున్నారు. ఈసారి ఇంటలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో పోలీసులు మునుపెన్నడూ లేనంత భారీగా భద్రత కల్పించారు. ఈ క్రమంలో కొందరు సీనియర్‌ నేతలకు సీఎంను కలిసే అవకాశం దక్కకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

భారీ కాన్వాయ్‌తో అలుగునూరుకు
ఉదయం 10.45 గంటల ప్రాంతంలో తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో సీఎం అలుగునూరు బయల్దేరారు. అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌ కూతురు హరిలావణ్య–కిశోర్‌బాబుల వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి తప్పకుండా వస్తానని కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్థానిక నేతలు సంతోషం వ్యక్తంచేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, డాక్టర్‌ సంజయ్‌కుమార్, కే.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీమంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జి.వి. రామక్రిష్ణారావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఫుడ్‌ కమిషన్‌ డైరెక్టర్‌ ఆనంద్, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో జరిగిన దళితబంధు సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పథకం అమలు, నిర్వహణ విషయంలో పలు కీలకసూచనలు చేశారు.

ఎటుచూసినా పోలీసులే..!
నగరంలో సీఎం పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో నగరంలోని అలుగునూరు, కమాన్‌ చౌరస్తా, బస్టాండ్, గీతాభవన్‌ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో అడగుడుగునా పోలీసులు మోహరించారు. సీఎం భద్రతావిభాగంతోపాటు, స్థానిక పోలీసులు, ఏఆర్‌ పోలీసులను విధుల్లో ఉంచారు. ముఖ్యంగా సీఎం నివాసమైన తీగలగుట్టపల్లిలో ఆయన నివాసం వరకు భారీగా ప్రత్యేక బలగాలు మోహరించారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం సెక్యూరిటీతోపాటు టీఎస్‌ఎస్‌పీ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది పహారా కాశారు. మధ్యాహ్నం దాదాపు 3.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరిన సీఎం కేసీఆర్‌ అక్కడ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

కలెక్టరేట్‌ వద్ద మూడంచెల తనిఖీ వ్యవస్థ
సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్‌ ఖాకీల నీడన చేరింది. శుక్రవారం సీఎం కలెక్టరేట్‌లో దళితబంధుపై సమీక్షించగా ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. ప్రతి సముదాయాన్ని ఆధీనంలోకి తీసుకోగా మూడంచెల తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఐజీ స్థాయిలో భద్రత ఏర్పాట్లను చేయగా సుమారు 200లకు పైగా పోలీసులు పహారా కాశారు. కలెక్టరేట్‌కు సంబంధించిన రెండు ద్వారాలను మూసివేయగా గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను మాత్రమే లోనికి అనుమతించారు.

ఉద్యోగి, అధికారి అయినా గుర్తింపు కార్డు లేకుంటే అనుమతించలేదు. అత్యంత పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం నిర్వహించిన సమావేశమందిరానికి అధికారులను తప్పా ఎవరిని అనుమతించలేదు. కలెక్టర్‌ పోర్ట్‌కో, కలెక్టరేట్‌ ఇన్‌వార్డు, ఆర్డీవో కార్యాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ మీటింగ్‌ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసుల చెరలో కలెక్టరేట్‌ ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉన్నతాధికారులను కలువలేక నిరాశగా వెనుదిరిగారు.  

చదవండి: నేటి నుంచే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు