నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్‌

6 Aug, 2022 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్‌, మిషన్‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందన్నారు.

అయితే నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్ర పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పూర్తయినా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: Telangana: అదే సీఎం కేసీఆర్‌ వ్యూహం!

మోదీకి రాసిన లేఖలో కేంద్ర విధానాలపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్ర కొత్త నిబంధన తీసుకొచ్చిందన్న కేసీఆర్‌.. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్‌ పడుతుందని అన్నారు.. నీతి ఆయోగ్‌ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయిందని విమర్శించారు.

‘రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు. దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. రూపాయి విలువ పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలాంటి ముఖ్య అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదు. ఢిల్లీలో కూడా నీళ్లు దొరకడం లేదు. నీతి ఆయోగ్‌ ఏం చేసింది. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ జరగడం లేదు. కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతుంది.

దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా కేంద్రం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది.  దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బతింది. రైతుల పెట్టుబడి డబుల్‌ అయ్యింది. సంపాదన డబుల్‌ అవ్వలేదు. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయి.’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రం, నీతి ఆయోగ్‌పై నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు