పిడికెడు లేని బీజేపీ నేతలు మా జోలికి వస్తే ఖబడ్దార్‌: సీఎం కేసీఆర్‌

11 Feb, 2022 17:28 IST|Sakshi

సాక్షి, జనగామ: పిడికెడు లేని బీజేపీ నేతలు తమ జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ సీఎం కేసీఆర్‌  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట రైతుల‌ను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ ప్రాణం పోయినా బావుల వ‌ద్ద‌ మోటార్లకు క‌రెంట్ మీట‌ర్లు పెట్టమని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు జనగామలోని యశ్వంత్‌పూర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు. తమను ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు

ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాం
తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకుంటే ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాం.. న‌రేంద్ర మోదీ జాగ్ర‌త్త అని కేసీఆర్ హెచ్చ‌రించారు. ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా అంటూ నిప్పులు చెరిగారు. నీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోదీని ఉద్ధేశిస్తూ విమర్శించారు. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడటానికి సిద్ధమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్ర‌జ‌లు న‌న్ను ఆశీర్వ‌దించి అసెంబ్లీకి పంపితే తెలంగాణ‌ను సాధించామని, మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమన్నారు.
చదవండి: ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయి: సీఎం కేసీఆర్‌

పిట్ట బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదు
‘జాగ్ర‌త్త న‌రేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ‌. జ‌న‌గామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్ర‌స్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్ర‌త్త‌లా మీరు ఉండండి. మా జాగ్ర‌త్త‌లా మేం ఉంటాం అని కేసీఆర్ సూచించారు.

గతంలో బచ్చన్నపేటను చూస్తే బాధనిపించేది. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది.రాష్ట్రంలో తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి దళిత కుటుంబానికి చేయూతగా దళితబంధు తెచ్చాం. జనగామ ఒకప్పుడు కరువు సమీగా ఉండేది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ది చేశాం. మోదీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలంటోంది. మేము మీటర్లు పెట్టం. పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మెడికల్‌ కాలేజీపై త్వరలోనే జీవో ఇస్తాం’ అని కేసీఆర్‌ తెలిపారు

మరిన్ని వార్తలు