కేంద్రంతో మమత ఢీ

12 Dec, 2020 03:56 IST|Sakshi

నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనతో తీవ్ర విభేదాలు

కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్‌ ధన్‌కర్‌ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది.

బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్‌– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్‌ హార్బర్‌లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్‌కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.

నిప్పుతో చెలగాటం వద్దు..
బెంగాల్‌ గవర్నర్‌ ధన్‌కర్‌ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు  వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్‌ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు